హాకీ క్రీడాకారులతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి
ఆదిలాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అండర్ హాకీ టోర్నమెంట్‌లో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. స్కూల్ గేమ్ ఫెడరేషన్ టోర్నమెంట్‌లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చి విజయం సాధించారని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రైలే స్టేషన్‌లో వారికి ఘనంగా సాగతం పలికి, అభినందించారు. కప్ సాధించిన జట్టులో నలుగురు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, కోచ్‌లు శ్రీను, శేఖర్, రవి, డేవిడ్ పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలో హాకీ స్టేడియం
వనపర్తి, నవంబర్ 8 (విజయక్రాంతి): జిల్లాలో దాదాపు రూ.25 కోట్లతో క్రీడా మైదానాలు, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని, మర్రికుంట మెడికల్ కళాశాల వద్ద హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
పెద్దగూడెం గ్రామ పరిధిలోని క్రీడా ప్రాంగణం, గ్రామ పక్కన ఉన్న మరో 3 ఎకరాల ఖాళీ స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో స్మిమ్మింగ్ పూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. బ్యాడ్మింటన్ వుడెన్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు.