calender_icon.png 4 November, 2024 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి

30-08-2024 06:17:17 PM

మాజీమంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జిల్లా ప్రజానీకం విషజ్వరాలతో ముప్పతిప్పలు పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ... పట్టణాలు.. పల్లెలు మంచం పట్టడం జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో డెంగీ, మలేరియ కేసులు నమోదు అవుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీజనల్ వ్యాధుల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా కృషి చేశామని గుర్తు చేశారు. విషజ్వరాల బారిన పడి ప్రజలు అల్లాడుతుంటే ఇంచార్జ్ మంత్రి సీతక్క కనీసం అధికారులతో సమీక్ష నిర్వహించడం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విషజ్వరాల బారిన పడి అనేక మంది తనువు చాలించారని, తమ ప్రభుత్వ హయంలో ఆ పరిస్థితులను మార్చామని తెలిపారు. వర్షాకాలం కంటే ముందుగానే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వార పరిసరాలను పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి... ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చేసినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్చదనం పచ్చదనం పేరిట అయిదు రోజులు కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. రిమ్స్ లో, పీహెచ్సీలలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రైవేటు మెడికల్ లకు మందులు రాసిన అధికారులపై వేటు వేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అనేక మంది సిబ్బంది వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లలో వైద్యుల కొరత సైతం తీవ్రంగా వేధిస్తోందని, తాజాగా రిమ్స్ లో పని చేస్తున్న వైద్యులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు. సవతి తల్లి ప్రేమను చూపించడం తాగదని.  తక్షణం ఆదిలాబాద్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ,ఊరురుకు హెల్త్ క్యాప్ లు ఏర్పాటు  చేయాలని  జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ, అజయ్, సాజిదోద్దీన్, కుంర రాజు, సేవ్వా జగదీష్,  శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.