calender_icon.png 4 November, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పునకు కట్టుబాటు

03-11-2024 02:31:55 AM

  1. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టీకరణ
  2. హనుమకొండలో బహిరంగ విచారణకు 232 విజ్ఞప్తులు

జనగామ, నవంబర్ 2 (విజయక్రాంతి): బీసీ కమిషన్ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఏ తీర్పు వెలువరించినా దానికి కట్టుబడి ఉంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. ఇటీవల హైకోర్టు ఆదేశాలపై తమకు స్పష్టత లేదని, ఆ ఉత్తర్వులు ఇంకా కమిషన్‌కు అందలేదని ఆయన తెలిపారు.

కాగా, శనివారం హనుమకొండలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై బీసీ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ విచారణకు అనూహ్య స్పందన లభించింది. హనుమకొండ కలెక్టరేట్‌లో విచారణ చేపట్టగా వివిధ కుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ విజ్ఞప్తులు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 232 విజ్ఞప్తులు రాగా.. కమిషన్ స్వీకరించింది.

హనుమకొండ, వరంగల్ నుంచి 142, మహబూబాబాద్ నుంచి 26, జనగామ నుంచి 29, భూపాలపల్లి నుంచి 28, ములుగు నుంచి 7 విజ్ఞప్తులు అందినట్లు బీసీ కమిషన్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయ నున్నట్లు తెలిపారు.

వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారని, రాజకీయాల్లో తమకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరారని ఆయన చెప్పారు. రిజర్వేషన్ జాబితాలో ఐదు శాతం నో క్యాస్ట్ వారికి స్థానం కల్పించాలని కుల నిర్మూలన సంఘం కోరిందన్నారు. బహిరంగ విచారణలో బాలికల హాస్టల్‌లో సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు.

త్వరలోనే బాలసముద్రంలోని హాస్టల్‌కు వెళ్లి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే కోసం ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని సూచించారు.