మే చివరినాటికి 1.20 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఈ ఖరీప్‌కు 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుందని సరిపడా విత్తనాలు మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. 2021 సంవత్సరంలో 60.53 లక్షల ఉన్న పత్తి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందని, అయినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లోకి పత్తికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది విస్తీర్ణం పెరిగే అవకాశముందని దానికి తగ్గట్టు పత్తి విత్తనాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా ఈ సారి 1.20 లక్షల ప్యాకెట్లను మార్కెట్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలుగా సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ సారి పత్తి విత్తన ప్యాకెట్ గరిష్ఠ ధర రూ.864 నిర్ణయించిందున డీలర్లు ఇంతకంటే ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, విత్తనాల సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. విధుల పట్ల అలసత్వంం వహించే అధికారులపైనా చర్యలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అమ్మకాలు పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.