11-12-2024 12:59:22 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ ౧౦ (విజయక్రాంతి): గ్రేటర్ సహా ఓఆర్‌ఆర్ వరకు తాగునీటి సరఫరా, మురుగు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జలమండలి లో పలు పోస్టులకు ఉన్నతాధికారులు సహా పలువురు కిందిస్థాయి అధికా రుల కొరత ఏర్పడింది.
ఓ పక్క సీనియర్ అధికారులు పదవీ విరమణ పొందడం.. వారి స్థానంలో వేరే అధికారులను నియమించడం జలమండలి యాజమాన్యానికి సవాలుగా మారుతోంది. దీంతో ప్రస్తుతం వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులకే అదనపు(అడిషనల్) బాధ్యతలు అప్పగిస్తున్న పరిస్థితి.
జలమండలి ఎండీ మొదలు క్షేత్రస్థాయి మేనేజర్ల వరకు పలువురు అధికారులు జోడు(రెండు) పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం. రెగ్యులర్ పోస్టుకు తోడు అదనపు బాధ్యతలు ఉండటంతో అధికారులు ఓ వైపు ఒత్తిడికి గురికావడంతో పాటు మరోవైపు ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నట్లు విమర్శలున్నాయి.
జంట పదవులున్నది వీరికే..
జలమండలి ఫైనాన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన వాసుదేవనాయుడు ఈ ఏడా ది ఆగస్టులో వీఆర్‌ఎస్ తీసుకోవడంతో ఆ బాధ్యతలను జలమండలి ఎండీకే అదనంగా అప్పగించారు. ఓ పక్క జలమండలి చేపట్టిన 90రోజుల ప్రత్యేక కార్యక్రమం, ఇతర కార్యక్రమాలకు తోడు ఫైనాన్స్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తుండటం గమనార్హం.
ఇటీవల ఇద్దరు డైరెక్టర్లు పదవీ విరమణ చెందడంతో ఇద్దరు సీజీఎంలకు అదనంగా డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. డివిజన్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించే దాదాపు ఐదుగురు జీఎంలు, మరో ఐదుగురు డీజీఎంలు, 20మందికి పైగా డీజీఎం లకు కూడా అదనపు బాధ్యతలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల వివిధ డివిజన్లలో డిప్యుటేషన్‌పై బాధ్యతలు నిర్వహిస్తున్న హౌజింగ్ శాఖకు సంబంధించిన దాదాపు 44మంది ఏఈలు మాతృసంస్థకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యే అవకాశమున్నటు సమాచారం. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన జలమండలిలో పోస్టులను భర్తీ చేసి తమపై వొత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రోత్సహించాలని ఆ శాఖ అధికారులు కోరుతున్నారు.
రిటైర్‌మెంట్‌కు తగినట్లు భర్తీకానీ పోస్టులు..
జలమండలిలో ప్రతి నెలా వివిధ స్థాయిల్లోని అధికారులు పదవీ విరమణ పొందు తున్నారు. నాలుగైదు నెలలుగా జలమండలిలో డైరెక్టర్ స్థాయిలో బాధ్యతలు నిర్వహిం చిన ఉన్నతాధికారులు దాదాపు ఆరుగురు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో అర్హ త గల వారిని నియమించాల్సినప్పటికీ ఆ నియామకాలు జరగడంలేదు.
అయితే ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఓ కేసు కోర్టులో ఉండటంతో పదోన్నతులు కల్పించడంలో ఆలస్యం జరుగుతోందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఉన్న అధికారులకు జలమండలి యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.