18-02-2025 11:45:26 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్ ను మంగళవారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్, టాయిలెట్స్, తరగతి గదులు, పరిసరాలను ఆమె పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మెనూ ప్రకారం పక్కాగా అమలు చేస్తూ, నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు.
విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడానికి ప్రతి సబ్జెక్టు వారిగా ప్రత్యేక శ్రద్ధ వహించి, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య బోధనలు అందించాలన్నారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ భోజనం సిద్ధం చేయాలన్నారు. వసతి గృహాల పరిసరాలలో సానిటేషన్ చేస్తూ పరిశుభ్రముగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, సంబంధిత స్పెషల్ అధికారి తదితరులు ఉన్నారు.