17-02-2025 11:18:55 PM
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ఈ మధ్యకాలంలో పిల్లలు తరచూ ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిల్లో మోసపోయి కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ ఖానామెట్ కు చెందిన అరవింద్ (23) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. కాగా అతను గతకొన్ని రోజులుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వాటికి పూర్తిగా బానిస అయ్యాడు. ఈ క్రమంలో రూ. 2 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇదే విషయంపై ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఇబ్బంది అవుతుందని ఇంటి నుండి పరారయ్యాడు. అరవింద్ కుటుంబ సభ్యులు కంగారుపడి బంధువుల ఇండ్లలో ఇరుగుపొరుగు వారిని అడిగి అరవింద్ కోసం తెలుసుకున్నారు.
చివరకు అతని పట్టుకుని మందలించి ఇంటికి తీసుకువచ్చారు. తన శైలినీ మార్చుకొని అరవింద్ కొన్ని రోజులకే మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఆదివారం రాత్రి కూడా మరోసారి ఆన్లైన్లో గేమ్ ఆడి రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన అరవింద్ తన రూమ్ లోనే సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అరవింద్ తల్లిదండ్రులు ఎంత పిలిచిన పలకకపోవడంతో డోర్ బద్దలు కొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.