calender_icon.png 17 October, 2024 | 4:52 AM

అవినీతికి అడ్డా కందనూల్ మున్సిపల్

17-10-2024 02:25:27 AM

కార్మికుల జీతాలను దిగమింగిన ఘనులు

చెత్త తరలించే వాహనాల పేరుతో డీజిల్ లూటీ

ముడుపులు తీసుకుని భూ ఆక్రమణదారులకు మద్దతు!

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1౬ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ అవినీ తిలో నంబర్ వన్ రేటింగ్‌ను సంపాదిస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాలకు రుచి మరిగి ప్రజా ధనాన్ని లూటి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలను వారి కుటుంబ సబ్యుల ఖాతాల్లోకి మళ్లించి దిగమింగేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ చెత్త సేకరిస్తున్నట్టు రికార్డులు పెట్టి అట్టి వాహనాలకు డీజిల్ మూడింతలు నమోదు చేసుకుని ఆ ధనాన్ని కూడా మింగేస్తున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమార్కుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లుతున్నాయి. ఇంటి నంబర్, నల్లా కనెక్షన్‌లు ఇవ్వాలన్న, చివరికి ట్రేడ్ లైసెన్స్‌లు ఇవ్వాలన్న డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

పట్టణంలోని టిఫిన్ బండ్లు, ఛాయ్ దుకాణాలు, రెస్టారెంట్లు ఇత ర వాటిలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా వారి నుంచి తరుచూ టిఫిన్, బిర్యానిలకు కక్కుర్తి పడి శానిటేషన్ విభాగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.

పట్టణంలో ఏర్పాటు చేసే భారీ ఫ్లెక్సీలు, కటౌట్లకు అనుమతి పొందాల్సి ఉన్నా పొలిటికల్ లీడర్ల వద్ద చేయిచాచి టౌన్‌ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీ ఆదా యానికి గండి కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెప్మా, రెవెన్యూ విభాగాల్లోనూ భారీ అక్రమాలు జరుగుతున్నా మున్సిపాలిటీ కమిషనర్ వంత పాడుతుండటంతో ముడుపులు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు కూడా అవినీతి అక్రమా లకు పరోక్షంగా మద్దతునిస్తున్నట్టు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.

ఇలా వెలుగులోకి 

మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సక్రమంగా రావ డంలేదని ఓ వ్యక్తి సమాచార హక్కు ద్వారా వివరాలు సేకరించగా అశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యుత్ వెలుగులు అందించే విద్యుత్ దీపాల రిపేరులోనూ భారీగా అవినీతి జరిగిందని తెలుస్తోంది.

మొదటి వార్డు సర్వే నంబర్ 7లో ఓ మాజీ ప్రజాప్రతినిధి, ప్రస్తుత కౌన్సిలర్ ఇద్దరు వేర్వురుగా ప్ర భుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలను చేపడుతున్నట్లు పూర్తి ఆధారాలను సమర్పిస్తూ వార్డు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారుల నుంచి అధికారులు ముడుపులు అందుకుని వారికే మద్దతు తెలపడం విశేషం. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్లు నిర్మాణాలు జరగుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమా నాలకు తావిస్తోంది. 

ప్రైవేట్ వ్యక్తి బ్యాంక్‌లోకి జీతాలు 

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వారి ఖాతాల్లోకి కాకుండా మున్సిపాలిటీ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) అదనంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు చూపుతూ తన కుటుంబానికి చెందిన అల్లం సంతోషి అనే వ్యక్తి ఖాతాల్లోకి జమ చేశారు. అందుకు సంబంధించిన ఫైల్స్‌పై మేనేజర్, ఏఈ, జూనియర్ అసిస్టెంట్‌తో పాటు కమిషనర్ కూడా సంతకం చేయడం గమనార్హం.

ఈ తప్పులో భాగం పంచుకున్న కమిషనరే జూనియర్ అసిస్టెంట్ ఒక్కరికే మెమో ఇవ్వడం వెనుక ఆంత్యర్యం అంతు చిక్క డం లేదు. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ దేవసా యంను వివరణ కోరగా కమిషనర్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్పడం కొసమెరుపు. ఈ అవినీతిలో ఉన్నతాధికారులు కూడా భాగం పంచుకున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

అజ్ఞాతంలోకి కమిషనర్

అవినితీ బాగోతం బయట పడటంతో మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ జూనియర్ అసిస్టెంట్‌కు మెమోను జారి చేస్తూ తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత ఆరు రోజు లుగా ఎవరికీ అందుబాటులోకి రాకు ండా జారుకున్నారు. చివరికి పాలనాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమస్యలపై ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదు.