వాన్‌పిక్ కేసు కొట్టేయాలన్న పిటిషన్ డిస్మిస్ చేసినహైకోర్టు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారంటూ సీబీఐ నమోదు చేసి వాన్‌పిక్ భూకేటాయింపుల కేసును కొట్టేయాలంటూ ఏబూ నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారాన్ని సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. తీర్పుతో సంబంధం లేకుండా పిటిషనర్ చేసుకునే డిశ్చార్జి పిటిషన్‌లోని మెరిట్స్ ఆధారంగా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు జారీచేసింది. వాన్‌పిక్ ప్రాజెక్టు ఏర్పా టులో భాగంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (జీ2జీ) పద్ధతిలో రసల్ అల్ ఖైమా (రాక్)తో అప్పటి వైఎస్సార్ సర్కార్ ఒప్పందం చేసుకుంది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 12,073 ఎకరాలను రూ.16,530 కోట్లకే వాన్‌పిక్‌కు కేటాయించింది. ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ కంపెనీల్లో రూ.854 కోట్ల పెట్టుబడులుగా పెట్టి పరస్పరం లబ్ధిపొందారని సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు విచారణకు తీసుకోవడాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. నిజాయితీగా పెట్టిన పెట్టుబడులు, ముడుపులు, ఇతర ఆరోపణలు మొదలైనవన్నీ పూర్తి విచారణలోనే తేలుతాయని స్పష్టం చేశారు.