10-04-2025 01:16:38 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 9: ప్రజల సౌకర్యార్థం సిసి రోడ్డు వేసిన అధికారులు ఆ తర్వాత దాని క్యూరింగ్ పనులను పూర్తిగా విస్మరించారు. దీంతో రోడ్డు నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి లోని అత్తాపూర్ డివిజన్ సిరిమల్లె నగర్ లే అవుట్ లో నాలుగైదు రోజుల క్రితం 16 లక్షల వ్యయంతో జిహెచ్‌ఎంసి ఏఈఈ రాజేష్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు నిర్మించారు.
ఇదంతా బాగానే ఉన్నా.. రోడ్డు నిర్మాణం తర్వాత కాంట్రాక్టర్ క్యూరింగ్ పనులను విస్మరించారు. అధికారుల పర్యవేక్షణ కూడా లేకుండా పోవడంతో సీసీ రోడ్డు నాణ్యత ’నేతి బీరలో నెయ్యి’ చందంగా మారింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన డివిజన్ ఏఈఈ ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
నీళ్లు చల్లుకుంటున్న స్థానికులు
16 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మించిన అధికారులు క్యూరింగ్ విస్మరించడంతో రోడ్డు పక్కన ఉన్న నివాసితులు దానిపై ప్రతిరోజూ నీళ్లు చల్లుకుంటున్నారు. సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ క్యూరింగ్ చేయకుండా చేతులు దులిపేసుకొన్నాడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో నా ణ్యత ఇతరత్రాలను పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజ్ లు తీసుకొని పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధి త శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
సిసి రోడ్డు పనుల్లో నాణ్యత పాటిస్తున్నాం. కాంట్రాక్టర్ క్యూరింగ్ పనులు చేయడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. ఈ విషయంలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
రాజేష్, అత్తాపూర్ డివిజన్ ఏఈఈ