- సెన్సెక్స్ 422 పాయింట్లు డౌన్
- 168 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై, నవంబర్ 21: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టు అరెస్టు వారెంటు జారీచేసిందన్న వార్తలతో గురువారం మార్కెట్ అతలాకుతలమ య్యింది. ట్రేడింగ్ తొలిదశలో 775 పాయిం ట్ల వరకూ కోల్పోయి 76,802 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 422 పాయింట్ల నష్టంతో 77,155 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 300 పాయిం ట్ల 23,780-23,470 పాయింట్ల మధ్య 200 పాయింట్లకుపైగా కోల్పోయి 23.287 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 168 పాయింట్ల నష్టంతో కీలకమైన 23,500 పాయింట్ల దిగువన 23,349 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశంలో రెండో పెద్ద శ్రీమంతుడైన గౌతమ్ అదానీ తన భారీ విద్యుత్ ప్రాజెక్టుల కోసం భారత్‌లో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాధికారులకు రూ.2,200 కోట్ల ముడుపులు ఇచ్చారని, అదే ప్రాజెక్టులకు తప్పుడు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు చూపించి, యూఎస్ బ్యాంక్‌లు, ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు సమీకరించారని అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలతో న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
దేశీయ మార్కెట్ క్షీణతకు అదానీ షాక్‌తో పాటు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం కారణమని విశ్లేషకులు తెలిపారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,736 షేర్లు క్షీణించగా, 1,237 షేర్లు లాభపడ్డాయి. విదేశీ ఫండ్స్ అమ్మకాలు తగ్గినట్లే తగ్గి, మళ్లీ పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల వెల్లువ
అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చాయన్న ఆందోళనలతో పలు బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. గత కొద్దిరోజులుగా మార్కెట్ బేర్స్ పట్టులోనే ఉన్నదని, అదానీ గ్రూప్ ముడుపులచ్చిందన్న వార్తతో ఆ గ్రూప్ షేర్లు, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరిగాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్స్ ఇష్యూ రద్దు
యూఎస్ కేసుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా మార్కెట్లో జారీచేసిన 600 మిలియన్ డాలర్ల బాండ్ల ఇష్యూను గురువారం రద్దు చేసింది. యూఎస్ న్యాయవాదులు గౌతమ్ అదానీ, ఇతర సహచరులపై కేసులు నమోదుచేసేందుకు కొద్ది గంటల ముందు యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ మార్కెట్లో 20 ఏండ్ల కాలప రిమితిగల గ్రీన్ బాండ్లను అదానీ గ్రీన్ ఎన ర్జీ విక్రయించింది.
ఈ బాండ్ ఇష్యూ మూ డు రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. తాజా పరిణామాల కారణంగా తమ 600 మిలియన్ డాలర్ల ఆఫర్‌ను నిలిపివేయాలని నిర్ణయించినట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. వాస్తవానికి నెలరోజుల క్రితం కూడా ఇదేతరహా బాం డ్లను విక్రయించాలని అదానీ సంస్థ ప్రయత్నించినప్పటికీ, కొందరు ఇన్వెస్టర్లు బాండ్ల ధరను ఆమోదించకపోవడంతో ఆ ఇష్యూ ను వాయిదా వేసుకున్నది.
అదానీ పోర్ట్స్ టాప్ లూజర్
సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సె జ్ షేరు 13 శాతం పతనమయ్యింది. స్టే ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, ఐటీ సీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 3 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్‌లు 1.5 శాతం వర కూ లాభపడ్డాయి.
వివిధ రంగాల సూచీ ల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 4.14 శాతం పడిపోయింది. యుటిలిటీస్ ఇం డెక్స్ 3.16 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.45 శాతం, పవర్ ఇండెక్స్ 1.34 శాతం చొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్, ఐటీ, రియల్టీ, టెక్నాలజీ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండె క్స్ 0.67 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం చొప్పున తగ్గాయి.
రూ.5 వేల కోట్ల షేర్లు విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎఫెక్ట్‌తో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం అమ్మకాల్ని పెంచారు. తాజాగా విదేశీ ఫండ్స్ మరో రూ. 5,320 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారంలో విక్రయాల్ని రోజుకు రూ.2,000 కోట్లలోపునకు తగ్గించిన ఎఫ్‌పీఐలు మంగళవారం మాత్రం రూ.3,400 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు.
ఈ వారంలో ఇప్పటివరకూ మూడు ట్రేడింగ్ రోజుల్లో రూ.10,000 కోట్లకుపైగా విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి. సెప్టెంబ ర్‌లో దాదాపు రూ.౫౭ వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన విదేశీ ఫండ్స్ అక్టోబ ర్ నుంచి భారీ విక్రయాలకు పాల్పడు తున్నాయి.
అదానీ షేర్లు క్రాష్
ఒక్కరోజులోనే రూ.2.19 లక్షల కోట్ల విలువ ఫట్
అదానీ గ్రూప్‌కు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లూ నిలువునా పతనమయ్యాయి. ఈ గ్రూప్ షేర్లు ఒక్కరోజు లోనే రూ.2.19 లక్షల కోట్లు మార్కెట్ విలువను కోల్పోయాయి. 2023 జనవరి యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై నివేదిక వెల్లడించిన సమయంలో నష్టపోయిన విలువకంటే తాజా నష్టం రెట్టింపు పైనే ఉన్నది.
గురువారం అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 22.61 శాతం కోల్పోయి ఏడాది కనిష్ఠస్థాయిలో ముగిసింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం పతనంకాగా, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.80 శాతం క్షీణించింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 13.53 శాతం, అంబూజా సిమెంట్స్ 11.98 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10.40 శాతం చొప్పున పడిపోయాయి.
అదాని విల్మార్ 9.98 శాతం, అదానీ పవర్ 9.15 శాతం, ఏసీసీ 7.29 శాతం, ఎన్‌డీటీవీ 0.006 శాతం చొప్పున తగ్గాయి. కొన్ని గ్రూప్ కంపెనీలు వాటి నిర్దేశిత కనిష్ఠస్థాయి వద్ద ఫ్రీజ్ అయ్యాయి. మొత్తం ఈ 10 గ్రూప్ కంపెనీలు కలిసి రూ. 2,19,878 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.