న్యూఢిల్లీ, జనవరి 16: అదానీ గ్రూప్‌పై సంచలన కథనాల్ని వరుసగా ఎక్కుపెట్టిన యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్‌ను మూసివేశారు. ఈ వార్తతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు గురువారం పెద్దపెట్టున ర్యాలీ జరిపాయి. బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడున్నదంటూ హిండెన్‌బర్గ్ వెలువరించిన వరుస కథనాలు అంతర్జాతీయంగా, దేశ వాణిజ్య, రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బిలియన్ల కొద్దీ హరించుకుపోయింది.
తమ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాకుడు నేట్ ఆండర్సన్ ప్రకటించడంతో తాజాగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. అధికంగా ఎన్‌డీటీవీ 9.15 శాతం జంప్ చేసింది. అంబూజా సిమెంట్స్ 3.88 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 3.35 శాతం, సంఘి ఇండస్ట్రీస్ 3.34 శాతం, అదానీ పవర్ 2.45 శాతం చొప్పున లాభపడ్డాయి.
అదానీ పోర్ట్స్ 2.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 1.78 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.74 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ 1.54 శాతం, ఏసీసీ 0.77 శాతం చొప్పున పెరిగాయి. అదానీ విల్మార్ మాత్రం 1.19 శాతం తగ్గింది. అదానీ గ్రూప్‌లోని 11 కంపెనీల మార్కెట్ విలువ రూ.12.92 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
మూసివేతకు కారణం!
తమ సంస్థ పనిస్వభావమే తన నిర్ణయానికి కారణమని ఆండర్సన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో హిండెన్‌బర్గ్ మూసివేతను ప్రకటించడం గమనార్హం. ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టరు జార్జ్ సొరోస్ హిండెన్‌బర్గ్‌కు ఆర్థిక అండగా ఉంటూ వచ్చారు. సొరోస్‌పై ట్రంప్ యంత్రాంగం తీవ్ర ఒత్తిడి పెట్టడమే హెడ్జ్ ఫండ్ మూసివేతకు దారి తీసి ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.