calender_icon.png 23 November, 2024 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో అదానీ దుమారం

23-11-2024 03:19:46 AM

విమర్శలు చేసుకుంటోన్న రాజకీయ నేతలు

ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రాల్లోనూ వణుకు

వివాదం ముదరడంతో స్పందించిన అమెరికా

భారత్‌తో సంబంధాలకు ఏ ఢోకా లేదని స్పష్టం

ఏపీలో అదానీ అంశంపై ఆరోపణలు

న్యూఢిల్లీ, నవంబర్ 22: అదానీ గ్రూప్ లంచాల వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశంలో వాణిజ్యం కన్నా ఎక్కువగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశంలోని పలు పార్టీలు అదానీతో సంబంధమున్న అధికార, విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అదానీ పవర్‌తో ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రాలు సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

అదానీ విషయంలో బీజేపీ.. అందులో మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సాహం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అవకాశంగా దేశంలోని విపక్ష నేతలు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అమెరికా మాత్రం రెండు దేశాల సంబంధాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రకటనలు చేస్తోంది. ఈ సంక్షోభం త్వరలోనే రెండు దేశాలు పరిష్కరించుకుంటాయని వెల్లడించడం గమనార్హం.

సమస్యను అధిగమిస్తాం: శ్వేతసౌధం

భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా కోసం రూ.2 వేల కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ డబ్బు కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించినట్లు అదానీ సహా మరో 10 మందిపై కేసు నమోదైంది. దీంతో ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జిన్‌పియర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అదానీ కేసు విషయం మా దృష్టికి వచ్చింది.

ఈ వ్యవహారంలో సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్, న్యాయశాఖ కచ్చిత సమాచారం ఇస్తుంది. కానీ ఈ అంశంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నో అంశాలపై రెండు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ఎన్నో సమస్యల తరహాలోనే దీన్ని రెండు దేశాలు అధిగమిస్తాయి అని కరీన్ ధీమా వ్యక్తం చేశారు.    

అదానీతో కెన్యా ఒప్పందం రద్దు

అమెరికాలో అదానీపై ఆరోపణలు  వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ గ్రూప్‌తో కెన్యా 700 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దేశంలో విద్యుత్ లైన్లను విస్తరించేందుకు అదానీతో ఒప్పందం కుదిరిందని, ప్రస్తుతం దీన్ని రద్దు చేసినట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు. పార్లమెంట్‌లో రూటో గురువారం ప్రసంగించే ముందు ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా కెన్యాలో విమానాశ్రయ విస్తరణకు అదానీ సంస్థ పంపిన ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. కాగా, ఇప్పటికే ఆ దేశంలో అదానీ వెంచర్లకు స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అడుగు దూరంలో మృత్యువును దాటి

* 26/11 దాడుల్లో తాజ్ హోటల్‌లోనే అదానీ

* త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ కుబేరుడు

ముంబైపై టెర్రరిస్టులు దాడి చేసిన నవంబర్ 26న తాజ్ హోటల్‌లో దుబాయి పోర్ట్ సీఈవోతో అదానీ లంచ్ చేశారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే దాడి జరిగింది. దీంతో అదానీ, మరికొంత మంది అతిథులను హోటల్‌లోని కిచెన్‌కు, ఆ తర్వా త బేస్‌మెంట్‌కు హోటల్ సిబ్బంది తరలించారు. రాత్రంతా అక్కడే ఉన్న ఆయన్ను మరుసటి రోజు కమాండోలు రక్షించారు. ఆ రోజు డబ్బు చెల్లించి బయటకు వెళ్తే కచ్చితంగా చనిపోయేవాడినని, 15 అడుగుల దూరంలో మృత్యువును చూశానని అదానీ తెలిపారు.

అయితే, 1998లో ముంద్రా పోర్టును నిర్వహించే స్థాయికి చేరుకున్న అదానీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. దేశంలోని ఎన్నో పోర్టులను ఆయన నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అనేక రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టి ముకేశ్ అంబానీని సైతం దాటారు. 


కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా అదానీ పేరు మార్మోగిపోతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు, అమెరికా కోర్టు కేసు నమో దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన జీవితం మొదటి నుంచీ ఏమీ సాఫీ సాగలేదు. అనూహ్య ఘటనలు, సంక్షోభాలే కనిపిస్తాయి. వాటిన్నంటినీ అధిగమించి అతి తక్కువ కాలంలోనే దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇప్పుడూ అదానీకి అలాంటి సమ స్యలే ఎదురయ్యాయి.

హిండెన్‌బర్గ్ ఆరోపణలతో లక్షల కోట్లు కోల్పోయిన అదానీ.. ఇప్పుడు అమెరికా నమోదు చేసిన లంచాల కేసుతో మరింత కూరుకుపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ జైన్ కుటుం బంలో జన్మించిన జీవితాన్ని పరిశీలిస్తే.. 

కిడ్నాప్ చేసి.. 

అదానీ తల్లిదండ్రులు శాంతీలాల్, శాంతా. వీరికి గౌతమ్ 8వ సంతానం. శాంతీలాల్ జౌళి వ్యాపారి. గౌతమ్ పాఠశాల విద్య పూర్తి చేయకుండానే 16 ఏళ్లకు ముంబైకి వలస వచ్చారు. రత్నాల వ్యాపారి వద్ద పనిచేసి తిరిగి 1981లో గుజరాత్‌కు వచ్చి సోదరునితో కలిసి ఫిలిం ప్యాక్టరీ నడిపారు. 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్ పేరుతో ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. 1994లో దాన్ని స్టాక్ ఎక్స్‌చేంజీల్లో నమోదు చేశారు. ఇదే ప్రస్తుత అదానీ ఎంటర్‌ప్రైజెస్. 1998లో అదానీతోపాటు తన పార్ట్‌నర్ శాంతీలాల్‌పటేల్‌కు గన్ చూపించి కొందరు కిడ్నాప్ చేసి ఓ రోజు తర్వాత వదిలేశారు. గ్యాంగ్‌స్టర్లు ఫజ్లు రెహమాన్, భోగిలాల్ ఈ కిడ్నాప్ చేశారంటారు కానీ ఆధారాలైతే లేవు. 

విచారించి నిర్ణయం తీసుకుంటాం: చంద్రబాబు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాం డ్‌ను మాజీ సీఎం జగన్ దెబ్బతీశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. జగన్ అవినీతిని సభలో చెప్పేందుకు సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏపీ ప్రభుత్వం అదానీతో ఒప్పందాలను జాగ్రత్తగా గమనిస్తోంది. పూర్తి సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. ఇంకోసారి ఎవరైనా ఇలాంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం. అమెరికా కోర్టులో దాఖలైన చార్జిషీట్ వివరాలు కూడా మా వద్ద ఉన్నాయి. దీనిపై అధ్యయనం చేసిన ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాం అని చంద్రబాబు తెలిపారు. 

మాకేం సంబంధం లేదు: ఎంకే స్టాలిన్

అదానీ గ్రూప్ లంచాల ఆరోపణలను తమిళనాడు సీఎం స్టాలిన్ తోసిపుచ్చారు. అదానీ గ్రూపుతో తమకు సంబంధాలు లేవని, దీనిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2021లో తాము అధికారంలోకి వచ్చిననాటి నుంచి అదానీ గ్రూప్‌తో ఎలాంటి ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోలేదని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. అదానీపై వస్తోన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని డీఎంకే కీలక నేత శరవణన్ కేంద్రంలోని బీజేపీకి సవాలు విసిరారు.

అదానీతో బీజేపీకి సంబంధం లేకుండా విచారణకు ఆదేశించేందుకు ఏ సమస్యలు అడ్డు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. అదానీపై సీబీఐ, ఈడీ, ఐటీని ఎందుకు ఉపయోగించరు? అని నిలదీశారు.


ఏపీ పరువు తీశారు: జగన్‌పై షర్మిల ఫైర్

అదానీ నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఒప్పందాల కోసం కొన్ని రాష్ట్రాలకు రూ.2,100 కోట్లు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అందులో రూ.1,750 కోట్లు జగన్‌కు లంచం ఇచ్చినట్లు స్పష్టమైంది. ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టినట్లు ఏజెన్సీలు స్పష్టం చేశాయి.

ఈ కేసుతో అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారు అని షర్మిల మండిపడ్డారు. లంచాల కోసం రాష్ట్రాన్ని సొంత జాగీరులా వాడుకున్నారని, విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, జగన్ అక్రమాలతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతోందని షర్మిల అన్నారు.