calender_icon.png 10 January, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

యూఎస్ రుణాలకు అదానీ బైబై

12-12-2024 12:00:00 AM

శ్రీలంక ప్రాజెక్టు లోన్ డీల్ ఉపసంహరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికా నుంచి పలు లీగల్ చర్యల్ని ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ యూఎస్ నుంచి రుణ సమీకరణకు దూరం జరిగింది. శ్రీలంకలో పోర్టు టెర్మినల్ నిర్మాణానికి రుణాల కోసం యూఎస్ ఏజెన్సీకి సమర్పించిన వినతిని ఉపసంహరించుకున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలిపింది. తమ సొంత వనరులతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని, వచ్చే ఏడాది తొలినాళ్లలో పోర్టు టెర్మినల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు కోసం యూఎస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ)తో చేసుకున్న రుణ లావాదేవీని ఉపసంహరించుకున్నామని అదానీ పోర్ట్స్ పేర్కొంది. అదానీ గ్రూప్ అధికారులపై ముడుపుల చెల్లింపు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ‘పరిణామాల్ని విశ్లేషిస్తున్నామని ఇటీవల యూఎస్ ఏజె న్సీ ప్రకటించింది. ఈ రుణానికి సంబంధించి డీఎఫ్‌సీ ఇప్పటివరకూ అదానీ గ్రూప్‌నకు ఎటువంటి నిధుల్ని పంపిణీ చేయలేదు.

శ్రీలంకలోని కొలంబో రేవులో కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ పేరుతో అదానీ నిర్మిస్తున్న డీప్‌వాటర్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ కోసం 553 మిలియన్ డాలర్ల రుణాన్ని  (దాదాపు రూ.4,700 కోట్లు) అందించడానికి గత ఏడాది నవంబర్‌లో ఐడీసీ అంగీకరించింది. ఈ టెర్మినల్‌ను అదానీ పోర్ట్స్, శ్రీలంక పోర్ట్స్ అథారిటీ, జాన్‌నెల్స్ హోల్డింగ్స్‌ల కన్సార్షియం అభివృద్ధి చేస్తున్నాయి.ఈ వెంచర్లో అదానీ పోర్ట్స్‌కు 51 శాతం వాటా ఉన్నది.