calender_icon.png 30 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ వేతనం తన ఎగ్జిక్యూటివ్‌లకంటే తక్కువ!

24-06-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూన్ 23: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న జీతం తన కంపెనీల్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకంటే తక్కువగా ఉన్నట్టు గ్రూప్ కంపెనీల వార్షిక నివేదికల్లో వెల్లడయ్యింది. అదానీ గ్రూప్‌లో మొత్తం 10 లిస్టెడ్ కంపెనీలు ఉండగా, అందులో రెండింటినుంచే ఆయన జీతం తీసుకున్నారు. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.2.19 కోట్ల జీతాన్ని, రూ.27 లక్షల అలవెన్సులు పొందగా, మొత్తం రూ.2.46 కోట్లు అందుకున్నారు.

అంతక్రితం ఆర్థిక సంవత్సరంకంటే ఇది 3 శాతం ఎక్కువ. మరో గ్రూప్ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ నుంచి రూ.6.8 కోట్ల జీతభత్యాలు పొందినట్టు కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. ఈ రెండు కంపెనీల నుంచి కలిసి రూ.9.24 కోట్ల వేతనాన్ని పొందారు. ఇదే సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ బోర్డులో డైరెక్టర్, కీలక అధికారి అయిన వినయ్ ప్రకాశ్ మొత్తం రూ.89.37 కోట్ల రెమ్యునిరేషన్ తీసుకున్నారు. గ్రూప్ సీఎఫ్‌వో జుగేషిందర్ సింగ్ 9.45 కోట్ల వేతనాన్ని అందుకోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈవో వినీత్ జైన్‌కు కంపెనీ రూ. 15,25 కోట్ల జీతభత్యాల్ని చెల్లించింది.

బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్‌లో 106 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల్లో ద్వితీయస్థానంలో గౌతమ్ అదానీ కొనసాగుతున్నారు. ప్రధమస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉన్నారు. కొవిడ్ సంక్షోభం అనంతరం ముకేశ్ తన కంపెనీల నుంచి ఎటువంటి వేతనం తీసుకోవడం లేదు. అంతకు ముందు జీతభత్యాల్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.