calender_icon.png 28 November, 2024 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో అదానీ రగడ

28-11-2024 04:26:09 AM

  1. జేపీసీ వేయాలని విపక్షాల డిమాండ్
  2. లోక్‌సభలో మూడో రోజూ అదే తీరు
  3. గురువారానికి వాయిదా పడ్డ సభ

న్యూఢిల్లీ, నవంబర్ 27: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చించా లని కాంగ్రెస్ వాయిదా తీర్మానమిచ్చింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది.

విపక్షాలు లేవనెత్తిన ఈ అంశం తో ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దాంతో లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ 11.30 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత మళ్లీ ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో లోకసభ స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. 

ఎంపీల నినాదాల మధ్య రాజ్యసభ చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించినా.. ఆ తర్వాత కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో సభను వాయిదా వేశారు. 

అదానీని అరెస్ట్ చేయాలి: రాహుల్ 

సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. చిన్నచిన్న ఆరోపణలపై ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారని, వేల కోట్ల కుంభకోణ వ్యవహారంలో అదానీని జైలులో పెట్టాలన్నారు. మోదీ ప్రభుత్వం ఆయన్ను రక్షిస్తోందని విమర్శించారు. దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. జార్జి సోరోస్ స్క్రిప్ట్‌ను ఇక్కడ అమలు చేస్తున్నారని ఆరోపించింది.

అసభ్య సందేశాలపై..

ఎంపీ అరుణ్‌గోవిల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కట్టడిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ‘మన దేశ సంస్కృతికి, ఈ సామాజిక మాధ్యమ సంస్థలకు చెందిన దేశాల సంస్కృతికి తేడా ఉంది. అందుకే ఈ సందేశాలకు సంబంధించిన అంశాన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలించి, కఠిన చట్టాలు ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.