calender_icon.png 15 November, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ అల్టిమేటం

05-11-2024 12:00:00 AM

7వ తేదీలోపు బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సప్లయ్ నిలిపేస్తామని హెచ్చరిక

ముంబై: పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించక పోవడంతో బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్..బకాయిల చెల్లింపునకు గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీ లోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది.

ప్రస్తుతం అదానీ పవర్ సంస్థకు బంగ్లాదేశ్ ప్రభుత్వం రూ.7,200 కోట్లు (850 మిలియన్ డాలర్లు) బకాయి ఉంది. ఈ బకాయి చెల్లింపు విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డుకు, అదానీ పవర్‌కు మధ్య ఏమైనా సెటిల్మెంట్ జరిగిందా? అన్న విషయమై క్లారిటీ లేదు.

బకాయిలు చెల్లించడంతోపాటు సెక్యూరిటీ ఆఫ్ పేమెంట్ కోసం సుమారు రూ.1500 కోట్ల (170 మిలియన్ డాలర్లు)కు అక్టోబర్ 31 లోగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేయాలని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డుకు అదానీ పవర్ డెడ్ లైన్ పెట్టింది. కృషి బ్యాంకు ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

కానీ ఇది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో భాగం కాదని బీపీడీబీ వర్గాలు తెలిపాయి. డాలర్ల కొరత విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడానికి మరో కారణం అని ఆ వర్గాల కథనం. ఫలితంగా అక్టోబర్ 31 నుంచి జార్ఖండ్ లోని గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి 1496 మెగావాట్ల విద్యుత్ బదులు 724 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసింది.

ఇటీవల రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ లో ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. గత నెలలో సుమారు 90 మిలియన్ల డాలర్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అదానీ పవర్ కు బీపీడీబీ చెల్లించినట్లు సమాచారం. నెలవారీ 90-100 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లులకు కేవలం 20-50 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్లే బకాయిలు పెరిగిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి.