- అభియోగాలన్నీ గందరగోళంగా ఉన్నాయి
- అభియోగాల్లో వివరాలు లేవన్న మాజీ ఏజీ రోహత్గీ
- కాంగ్రెస్ కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తోంది
- సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ
న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా కేసు వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. భారత్‌లో అధికారులకు లంచాలు ఇచ్చి తమ సోలార్ ప్రాజెక్టులకు అనుమతి పొందారని, ఆ డబ్బును అమెరికాకు చెందినవారి నుంచి పొందారని న్యూయార్క్ కోర్టులో చార్జిషీట్ నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై మొదటిసారిగా అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్‌ఎనర్జీ స్పందించింది.
చార్జిషీట్‌లో కీలకమైన ఆరోపణల్లో అదానీ, ఆయ న బంధవు సాగర్ అదానీ, సంస్థ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ పేర్లు లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మహేశ్ జెఠ్మ లానీ సైతం ఈ కేసును విశ్లేషించి కీలక విషయాలు వెల్లడించారు.
చార్జిషీట్‌లో గందరగోళం
అమెరికా కోర్టులో వేసిన చార్జిషీట్‌లో మొత్తం 5 ఆరోపణలు చేశారని, అందులోని ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా గౌతమ్ అదా నీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ పేర్లు లేవని భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. అమెరికా కోర్టులో అదానీ కేసులో నమోదైన చార్జిషీట్ గందరగోళంగా ఉంది. చార్జిషీట్‌లో ఎవరికి ఎవరు లంచాలు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? అనే అంశాలపై స్పష్టత లేదు.
భారత అధికారులకు లంచాలు ఇచ్చారు అని చెప్పారు కానీ వారి పేర్లు, హోదా ఎక్కడా ప్రస్తావించలేదు. నేను అదానీ ప్రతినిధిగా మాట్లాడటం లేదు. ఒక లాయర్‌గా అమెరికా నేరారోపణలు పరిశీలించి ఈ విషయాలు చెబుతున్నా. మొత్తం 5 ఆరోపణల్లో 1, 5 అంశాలు కీలకం. ఈ రెండింటిలోనూ అదానీ, సాగర్, జైన్ పేర్లు లేవు. అధికారులపై ఆరోపణలు చేస్తే వారి పేర్లు, ఏ శాఖ తదితర వివరాలు చార్జిషీట్‌లో ఉండాలి. పేర్లు లేకుండా చార్జిషీట్ వేయడం ఆశ్చర్యకరంగా ఉంది. దీనిపై ఏమనాలో అర్థం కావట్లేదు. అదానీ న్యాయపోరాటం చేస్తారని భావిస్తున్నా అని చెప్పారు.
కాంగ్రెస్ రాజకీయమే..
అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని న్యాయవాది, ఎంపీ మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. అదానీపై అమెరికాలో అభియోగాలు మాత్రమే నమోదయ్యాయని, అవి రుజువు కాలేదని చెప్పా రు. చార్జిషీట్‌లో ఎలాంటి ఆధారాలు లేవు. కానీ కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. అమెరికా న్యాయశాఖ పనితీరు గురించి ఎప్పటి నుంచో ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. అది బైడెన్ కనుసన్నల్లో పనిచేస్తోందని చెప్పారు.
ఏదేమైనా చార్జిషీట్‌లో లంచాలు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మహారాష్ట్రలో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ వీటిని లేవనెత్తుతోంది అని మండిపడ్డారు.
వారి ప్రస్తావనే లేదు: అదానీ గ్రూప్
ఈ వివాదంపై మొదటిసారి స్పందించిన అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. ఈ కేసులో అదానీ, సాగర్, వినీత్ జైన్‌పై అమెరికాలో కేసు నమోదు చేశారనే వార్తల్లో నిజం లేదని స్టాక్ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. వీరి ముగ్గురు సెక్యురిటీస్‌కు సంబంధించిన కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
కానీ అమె రికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో గౌతమ్, సాగర్, వినీత్ జైన్ ప్రస్తావన లేదని గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్ స్పందన తర్వాత ఆ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్‌లో పుంజుకున్నాయి. దాదాపు 17 శాతం పైకి ఎగబాకాయి.