70 ఏళ్లకు బాధ్యతలనుంచి తప్పుకోనున్న గౌతమ్ అదానీ
ముంబయి: అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తన వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. 70 ఏళ్ల వయసులో బాధ్యతలనుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ అదానీకి 62 ఏళ్లు. 2030లో తన కుమారులకు బాధ్యతలను అప్పగించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం అదానీ గ్రూపు క్యాపిటలైజేషన్ దాదాపు 123 బిలియన్ డాలర్లుగా ఉంది. మౌలికం, పోర్టులు, షిప్పింగ్, సిమెంటు, గ్రీన ఎనర్జీ, విమానాశ్రయాలు, మీడియా సహా పలు రంగాలకు అదానీ గ్రూపు విస్తరించింది.
పది రిజిస్టర్డ్ కంపెనీలున్నాయి. తన తర్వాత వ్యాపారాలను ఉమ్మడిగా నిర్వహిస్తారా లేక ఎవరికి వారు వేరుగా ఉంటారా అని తన ఇద్దరు కుమారులు కరణ్, జీత్‌లతో పాటుగా సోదరుల వారసులు ప్రణవ్, సాగర్‌లను అడిగినట్లు ఈ ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ తెలిపారు. నిర్ణయించుకోవడానికి వారికి మూడు నెలలు సమయం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత వీరు వ్యాపారాలన్నిటినీ ఒక ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నారు.