నెగిటివ్ రేటింగ్ ప్రకటించిన మూడీస్, ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ, నవంబర్ 26: అమెరికాలో నమోదైన అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేశాయి.ఏడు అదానీ గ్రూప్ కంపెనీల రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘నెగిటివ్‌కు డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంగళవారం మూడీస్ ప్రకటించింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై యూఎస్ న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేయడం, యూఎస్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) మరో కేసును నమోదు చేసినందున రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది.
అదానీ గ్రూప్‌నకు చెందిన ఏడు కంపెనీలు.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్‌ఒన్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌పోర్టేషన్ రిస్ట్రిక్టడ్ గ్రూప్ 1, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ రేటింగ్స్‌ను నెగిటివ్‌లోకి మారుస్తున్నట్లు మూడీస్ తెలిపింది. మరో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ అదానీ గ్రూప్ జారీచేసిన కొన్ని బాండ్లను ‘నెగిటివ్ వాచ్’లో పెట్టింది.
యూఎస్ కేసులతో నిధుల సమీకరణకు గండి
అదానీ గ్రీన్ ఎనర్జీ చైర్మన్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురు సీనియర్ యాజమాన్య బృంద సభ్యులపై యూఎస్ అటార్నీ ఆఫీస్ క్రిమినల్ కేసు నమోదు చేయడం, ఎస్‌ఈసీ ఒక సివిల్ కేసును దాఖలు చేయడంతో ఈ రేటింగ్ చర్యల్ని తీసుకున్నామని మూడీస్ వివరించింది. యూఎస్ కేసుల కారణంగా నిధుల సమీకరణ అదానీ గ్రూప్‌ను కష్టసాధ్యమవుతుందని, ఆ గ్రూప్ ప్రాజెక్టుల మూలధన వ్యయం పెరిగిపోతుందని మూడీస్ పేర్కొంది.
రేటింగ్‌లో ఉన్న అదానీ గ్రూప్ కంపెనీల పాలనా వ్యవస్థ బలహీనపడుతుందని, వాటి వ్యయ ప్రణాళికలతో పాటు కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతుందని రేటింగ్ ఏజెన్సీ వివరించింది. అన్ని రేటెడ్ కంపెనీలకు గౌతమ్ అదానీయే చైర్మన్ బాధ్యతల్లో ఉన్నందున, అదానీ గ్రూప్ కంపెనీల అన్నింటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
సమీప భవిష్యత్తులో రేటింగ్స్‌ను అప్‌గ్రేడ్ చేసేది లేదని మూడీస్ స్పష్టం చేసింది. లీగల్ చర్యలు ముగిసిన తర్వాత గ్రూప్ కంపెనీలపై ఎటువంటి నెగిటివ్ క్రెడిట్ ఇంపాక్ట్ పడకపోతే, అప్పుడు రేటింగ్ అవుట్‌లుక్స్‌ను మారుస్తామని సూచనాప్రాయంగా తెలిపింది. రేటింగ్స్‌కు తగిన రీతిలో ఫైనాన్షియల్ పటిష్ఠతను కనపర్చి, వృద్ధి అవస రాలకు, రీఫైనాన్సింగ్‌కు నిధుల్ని సమీకరించగలిగినా, రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ కు మారుస్తామని మూడీస్ తెలిపింది.
నెగిటివ్ వాచ్‌లిస్ట్‌లో అదానీ బాండ్లు
అదానీ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై బాండ్లను ఫిచ్ రేటింగ్స్ నెగిటివ్ వాచ్ లిస్ట్‌లో పెట్టింది. ఈ రెండు కంపెనీల కార్పొరేట్ గవర్నెన్స్ రిస్క్ పెరగడం, గ్రూప్ కంపెనీలన్నింటికీ రిస్క్‌లు వ్యాపించి, నిధులు సమీకరణకు, లిక్విడిటీకి అవరోధం ఏర్పడనున్నందున బాండ్ల రేటింగ్‌ను నెగిటివ్ వాచ్‌లిస్ట్‌లో పెడుతున్నట్లు ఫిచ్ వివరించింది.
యూఎస్‌లో కేసుల్ని ఎదుర్కొంటున్న ఇద్దరు బోర్డు సభ్యులూ అదానీ గ్రూప్ వ్యవస్థాపక షేర్‌హోల్డర్లని, అందులో ఒకరు అదానీ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబైల్లో మెజారిటీ వాటాదారు అయిన ఎస్‌బీ అదానీ ఫ్యామిలీ ట్రస్టులో లబ్దిదారు అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.
తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ నిధుల్ని సేకరించలేదని, తద్వారా అదానీ ఎనర్జీ వృద్ధి ప్రణాళికలు దెబ్బతింటాయని, ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడుతున్నందున, రీఫైనాన్సింగ్ సమస్యలు ఏర్పడతాయని, రుణ వ్యయాలు పెరుగుతాయని వివరించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ 7 శాతం పతనం
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో మంగళవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లన్నీ తగ్గాయి. అన్నింటికంటే అధికంగా అదానీ గ్రీన్ ఎనర్జీ 7 శాతం పైగా క్షీణించి రూ.899 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4.78 శాతం తగ్గి రూ.2,149 వద్దకు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.79 శాతం క్షీణించి రూ.601 వద్దకు చేరాయి.
అదానీ టోటల్ గ్యాస్ 3.50 శాతం, అదానీ పోర్ట్స్ 3.23 శాతం, అదానీ పోర్ట్స్ 3.23 శాతం, అదానీ విల్మార్ 2.44 శాతం, అంబూజా సిమెంట్స్ 2.30 శాతం, అదానీ పవర్ 2 శాతం, సంఘి ఇండస్ట్రీస్ 1.91 శాతం, ఏసీసీ 1.37 శాతం, ఎన్‌డీటీవీ 0.10 శాతం మేర తగ్గాయి.