గౌతం అదానీ.. గత రెండు రోజులుగా వార్తాపత్రికలు, టీవీల్లో పతాకశీర్షికలకెక్కిన పేరు ఇది. ప్రపంచ అగ్రగామి కుబేరుల జాబితాలో చోటు దక్కించుకోవడమే కాకుండా ఒకానొక దశలో దేశంలో అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా రిలయెన్స్ అధినేత ముకేష్ అంబానీని వెనక్కి నెట్టిన వ్యక్తిపై ఇప్పుడు అమెరికాలో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమమార్గాలద్వారా అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు, రుణదాతలనుంచి సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాకుండా సౌరశక్తి ఒప్పందాలు పొందేందుకు భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల మేర లంచాలు చెల్లించినట్లు మరో కేసు కూడా నమోదయింది.
అంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్,తమిళనాడు, జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాల తో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉన్నతస్థాయి అధికారులకు భారీగా లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అదానీతో పాటుగా ఆయన కుమారుడు, అధికారులపైనా కేసులు నమోదు చేశారు. కేసులకు సంబంధించి ప్రాథమిక సమాచారం మాత్రమే బైటికి వచ్చినప్పటికీ దాని ప్రకంపనలు భారత రాజకీయాల్లో తీవ్రంగానే కనిపిస్తున్నాయి.
ఎందుకంటే అదానీ కంపెనీ ఉత్పత్తి చేసే సౌరవిద్యుత్‌ను కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మధ్యవర్తిగా వివిధ రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో అదానీ కంపెనీనుంచి ముడుపులు అందాయన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి పదేళ్ల క్రితంవరకు పెద్దగా ఉనికి లేని గుజరాత్ పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఉన్నపళంగా దేశంలోనే ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు.
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా గద్దెనెక్కిప్పటినుంచీ అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించింది. విమానాశ్రయాలు, పోర్టుల నిర్వహణ, వంటనూనెలు, సిమెంట్, విద్యుత్..ఇలా ఎన్నో రంగాలకు అదానీ గ్రూపు విస్తరించింది. టాటాలు, అంబానీలు లాంటి వాళ్లు వ్యాపార సామ్రాజ్యాలను ఏళ్ల తరబడి తమ శక్తియుక్తులతో నిర్మిస్తూ వసే..్త అదానీ మాత్రం ఆయా రంగాల్లో బలమైన సంస్థలను ఏదో విధంగా కొనేసుకుంటూ తన సామ్రాజ్యాన్ని విస్తరిం చుకోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లోను ఎన్నో ప్రాజెక్టులు అదానీ సొంతం అయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీవీకే గ్రూపునకు చెందిన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం, ఏపీలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ అధీనంలోకి వచ్చాయి. అగ్ర శ్రేణి సిమెంట్ కంపెనీలు అంబుజా, ఏసీసీలను బ్యాంకులు దాదాపు రూ.80వేల కోట్ల రుణాలు మంజూరు చేయడంతో అదానీ వశమయ్యాయి. అలాగే వంటనూనెల రంగంలోకీ అడుగుపెట్టి విల్మార్ కంపెనీని సొంతం చేసుకున్నారు. ఇది చాలదన్నట్లు ఆస్ట్రేలియా,శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యాలాంటి దేశాలకు కూడా తన వ్యాపారాలను విస్తరించారు.
అయితే అదానీ ఎక్కడ భారీ ప్రాజెక్టు చేపట్టినా ఏదో ఒక విమర్శ, ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన వ్యాపార తీరుతెన్నులపై ఆరోపణలూ అంతే స్థాయిలో వచ్చాయి. మరీ ముఖ్యంగా 2023 జనవరినుంచి చోటు చేసుకున్న ఉదంతాలతో ఆయన ప్రతిష్ఠ మసకబారింది. అదానీ గ్రూపు కంపెనీల లెక్కల్లో అవకతవకలు జరిగాయని, షేర్ల ధరలు కృత్రిమంగా పెంచుతున్నారంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించడం సంచలనమే అయింది.
పార్లమెంటును కుదిపేసిన ఈ వివాదం సుప్రీంకోర్టుకూ ఎక్కింది. వివాదంనుంచి అదానీ బైటపడినప్పటికీ దాని ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంతకాలం అదానీకి తిరుగు ఉండదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు అమెరికాలో కేసు నమోదయిన నేపథ్యంలో దానినుంచి అదానీ ఎలా బైటపడతారో వేచిచూడాలి.