- అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దు
- పెట్టుబడులు పెట్టేవారికి అప్పనంగా ఆస్తులు కట్టబెట్టం
- చట్ట ప్రకారం.. నిబంధనల మేరకే టెండర్లు ఆహ్వానిస్తాం
- అదానీ ముందు వంగి వంగి దండాలు పెట్టింది కేసీఆరే
- బీఆర్‌ఎస్ హయాంలోనే అదానీ సంస్థతో ఒప్పందాలు
- రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడుగుతాం
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మీ 100 కోట్లు మాకు వద్దు
స్కిల్ యూనివర్సిటీకి సీఎస్‌ఆర్ కింద ప్రకటించిన డబ్బులు..
ప్రభుత్వ ఖాతాలో జమచేయవద్దని అదానీకి రాష్ట్రప్రభుత్వం లేఖ
* కేసీఆర్ కుటుంబంలో సీఎం పదవీ కోసం పోటీ ఉంది. కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహ తహలాడుతున్నారు. అందుకే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లినా సీఎం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ముందే జైలుకు వెళ్లివచ్చారు. ఒక వేళ కేసీఆర్ కుటుంబానికి సీఎం అయ్యే అవకాశం వస్తే కవితనే ముందుంటారు.
రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి ) : అదానీ గ్రూప్‌పై కమీషన్ల ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీకి అదానీ గ్రూప్ ఇటీవల సీఎస్‌ఆర్ కింద ప్రకటించిన రూ. 100 కోట్ల విరాళాన్ని స్వీకరించొద్దని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో ఆ నిధులను జమ చేయవద్దని ఆదానీ గ్రూప్‌కు సంబంధిత శాఖ అధికారి జయేశ్‌రంజన్ లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, రోహిన్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అదానీ నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, తనతో పాటు మంత్రివర్గ సహచరులపై ఎలాంటి ఆరోపరణలు రావద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘చట్టబద్దంగా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది నిబంధన ఉంది.
ఆ నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని మా పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ స్పష్టంగా వివరించారు. అందులో భాగంగానే అదానీ కూడా రూ. 100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు అదానీతో సహా ఏ సంస్థ నుంచి ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదు.
అదానీ గ్రూప్ విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆ గ్రూప్ ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. రూ. 100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని అదానీకి రాసిన లేఖలో పేర్కొన్నాం. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో అదానీ విషయంలో జరుగుతున్న వివాదానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏమి సంబంధం లేదు.
ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదానీ ప్రకటించిన రూ. 100 కోట్ల విరాళం తీసుకోవడం లేదు. దీన్ని రాజకీయం కోణంలో చూసి చిల్లర, మల్లర మాటలతో వివాదస్పదం చేయవద్దు.’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అధికారం పోయింది.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది.. ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఎప్పుడు ఏమి మాట్లాడుతున్నాడో కేటీఆర్‌కే ఆర్థం కావడం లేదు. కేటీఆర్‌తో ఉన్నవాళ్లే నాకు ఫోన్ చేసి చెబుతున్నారు.’ అని సీఎం ఎద్దేవా చేశారు. అమెరికా లో చదువుకొని, పదేళ్లు మంత్రిగా ఉండి కూడా ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడంలేదని, ఆయన కేటీఆర్ కాదు.. సైకో రామ్’ అంటూ సీఎం మండిపడ్డారు.
నా ఢిల్లీ పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత లేదు..
తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించేందుకు వెళ్లారని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీఎం స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు, ఢిల్లీకి వెళ్లుతున్నట్లు చెప్పారు. మంగళవారం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి అందుబాటులో ఉండే కేంద్ర మంత్రులను కలుస్తామని తెలిపారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఒక సమావేశం కూడా ఏర్పాటుచేయనున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
నేను ఎవరి కాళ్లో పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్లడం లేదు..
కొంతమంది నాయకులు నా ఢిల్లీ పర్యటనను అర్రాస్ పాటలా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ 28సార్లు ఢిల్లీకి వెళ్లినట్లు లెక్కలేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులనుద్దేశించి సీఎం మండిపడ్డారు. ‘నేను మీలా మోదీ ముందు మోకరిల్లడానికి ఢిల్లీకి వెళ్లడం లేదు. ఎవరి కాళ్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో.. గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో నేను ఢిల్లీ వెళ్లడం లేదు.
మీ కడుపు మంట, మీ దు:ఖం మాకు తెలుసు. మీ కాకిగోలను మేం పట్టించుకోం. ఇది ఒకరిపై కోపం, పగ చూపాల్సిన సమయం కాదు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం మా హక్కు. అందుకు ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళతాం ’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం మండి పడ్డారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఒక వైపు విమర్శలు చేస్తున్నారని, మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు. అసలు పెట్టుబడుల విషయంలో వారి పాలసీ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదానీ ముందు వంగి, వంగి దండాలు పెట్టింది కేసీఆరేనని, తాను ఆ పని చేయలేదన్నారు.
రాష్ట్రానికి నిధులు ఇచ్చేది బీజేపీ ట్రెజరీ నుంచి కాదు..
గత ప్రభుత్వ పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర వద్దకు వెళ్లి నిధులు అడగకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో రాష్ట్రాభివృద్ధికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాజకీయ పక్షపాతం చూపకుండా కేంద్రం వద్దకు వెళ్లి కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలమన్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రాలకు ఇచ్చే హక్కు అని, ఆ నిధులు కేంద్రం ట్రెజరీ నుంచి వస్తాయని, బీజేపీ ట్రెజరీ నుంచి ఇచ్చే నిధులు కావని సీఎం పేర్కొన్నారు. కార్యదీక్షతో తెంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్లుతామన్నారు.
కేటీఆర్‌కు ఆ అవకాశం కూడా లేదు..
కేసీఆర్ కుటుంబంలో సీఎం కోసం పోటీ ఎక్కువగా ఉందని సీఎం చమత్కరించారు. కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారని అన్నారు. అందుకే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. జైలుకు వెళ్లినవారు సీఎం అవుతున్నారని మీడియాలో వచ్చిన కథనంపై సీఎం స్పందిస్తూ..
కేటీఆర్ జైలుకు వెళ్లినా సీఎం అయ్యే అవకాశం లేదని, ఎందుకంటే కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ముందే జైలుకు వెళ్లి వచ్చారని అన్నారు. ఒక వేళ కేసీఆర్ కుటుంబానికి సీఎం అయ్యే అవకాశం వస్తే కవితనే ముందుంటారని సీఎం ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనుల్లో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన విచారణ చట్టానికి లోబడే జరుగుతుందన్నారు. తప్పులు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఏం మాట్లాడుతున్నారు..?
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అధికారం పోయింది.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది.. ఇప్పుడు మెదడు కూడా పోయింది. అమెరికాలో చదువుకొని, పదేళ్లు మంత్రిగా ఉండి కూడా కేటీఆర్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడంలేదు.
ఆయన కేటీఆర్ కాదు.. సైకో రామ్.
అదానీతో అంటకాగారు..
అదానీతో గతంలోని బీఆర్‌ఎస్ సర్కారే అంటకాగింది. కేసీఆర్‌లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు.. అదానీ ఫ్లుటైలో ఆడంబరంగా తిరిగింది వాళ్లే. అదానీతో కలిసి కేసీఆర్, కేటీఆర్‌లు దిగిన ఫొటోలు ఇవిగో. అదానీతో ఒప్పందాలు చేసుకున్నవారే.. మా ప్రభుత్వంపై విమర్శలు చేయడమా?
అదానీతో అంటకాగారు..
రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఎవరికి కూడా ఆయాచిత లబ్డి చేకూర్చమని సీఎం స్పష్టంచేశారు. అదానీతో గతంలోని బీఆర్‌ఎస్ సర్కారే అంటకాగిందన్నారు. కేసీఆర్‌లా తాము అదానీ నుం చి అప్పనంగా తీసుకోలేదని, అదానీ ఫ్లుటైలో ఆడంబరంగా తిరిగింది వాళ్లేనన్నా రు. అదానీతో కలిసి కేసీఆర్, కేటీఆర్‌లు దిగిన ఫొటోలను సీఎం మీడియాకు చూపారు. అదానీతో ఒప్పందాలు చేసుకున్నవారే.
తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మామిడిపల్లిలో రక్షణ రంగ యూనిట్ల ఏర్పాటు, ఎలికట్ట లో మైక్రో డాటా సెంటర్ల ఏర్పాటు, మూడు జాతీయ రహదారుల (ఖమ్మం సూర్యాపేట, మంచిర్యాల రేపల్లివాడ, ఖమ్మం కోదాడ) నిర్మాణం, 750 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ ప్రాజెక్టు పనులను అదానీతో ఒప్పందాలు జరిగాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు.
దేశంలో బీజేపీని తిరస్కరించారు..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రానికి ఒక రకంగా, కేంద్రానికి ఒక రకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ కూటమి ఓటమి చవిచూసినా.. అదే రాష్ట్రంలో నాందేడ్ లోక్‌సభ కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్య ర్థి గెలిచారని సీఎం తెలిపారు.
కేరళలో వయనాడ్ లోక్‌సభ నుంచి ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా ఓట్ల మోజార్టీతో విజయం సాధించారని అన్నారు. కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ల్లో అసెంబ్లీ ఉపఎ న్నికల్లోనూ బీజేపీ ఒక్క సీటు గెలుచుకోలేదన్నారు. మహారాష్ట్రలో వాళ్లు మరో సారి అధికారం కాపాడుకున్నారని, జార్ఖండ్‌లో తమ పార్టీ కూటమి కూడా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని తెలి పారు.
ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా తెలంగాణ కు ఎలాంటి లాభం లేదని అన్నారు.