డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు!
ముంబై: సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ‘అదానీ విల్మర్ లిమిటెడ్ నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనుంది. ఈ మేరకు కంపెనీలో తమ పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అదానీ విల్మర్ లిమిటెడ్‌లోని తమకున్న వాటాలో 31.06శాతం విల్మర్ ఇంటర్నేషనల్‌కువిక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మిగతా 13 శాతం వాటాను కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ అవసరాల కోసం బహిరంగ మా ర్కెట్ల్లో అమ్మాలని నిర్ణయించింది. అయితే, ఎంత ధరకు వీటిని విక్రయిస్తారన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
కానీ, ఈ సేల్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నా యి. 2025 మార్చి 31కి ముందే ఈ విక్ర యం పూర్తికానున్నట్లు తెలుస్తోంది. అదానీ విల్మర్ లిమిటెడ్ నుంచి పూర్తిగా బయటకు వస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తెలిపింది. ఆ జాయింట్ వెంచర్ బోర్డు నుం చి తాము నామినేట్ చేసిన డైరెక్టర్లు కూడా పదవి నుంచి వైదొలగనున్నట్లు పేర్కొంది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న విల్మర్ ఇంటర్నేషనల్‌తో కలిసి అదానీ గ్రూప్ ‘అదానీ విల్మర్ లిమిటెడ్’ పేరిట జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఇరు సంస్థలకు 43.97 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విక్రయం కోసం దాదాపు ఏడాదికి పైగా చర్చలు జరిపినట్లు సమాచారం.
పోర్టుల నుంచి ఇంధనం వరకు వివిధ రంగాల్లో విస్తరించిన అదానీ గ్రూప్.. ఇకపై ఎఫ్‌ఎంసీజీ నుంచి వైదొలిగి కేవలం ఇన్ఫ్రా వంటి కీలక రంగాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత వంట నూనెల మార్కెట్లో అదానీ విల్మర్‌కు గణనీయ వాటా ఉంది. ఫార్చూన్ బ్రాండ్ పేరిట వంట నూనెలు సహా ప్యాకేజ్డ్ వంట సరకులను ఈ కంపెనీ విక్రయిస్తోంది.