calender_icon.png 9 October, 2024 | 9:57 AM

అంబానీని మించిన అదానీ

30-08-2024 12:00:00 AM

  1. రూ.11.6 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానం 
  2. హురున్ ఇండియా శ్రీమంతుల జాబితా 

న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత కుబేరుల్లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. గురువారం విడుద లైన హురున్ ఇండియా శ్రీమంతుల జాబితా 2024లో రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ నంబర్‌వన్ స్థానానికి చేరగా, గత ఏడాది ప్రధమస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తాజా జాబితాలో ద్వితీయస్థానంతో సరిపెట్టుకున్నా రు.  ఆయన సంపద రూ.10.14 లక్షల కోట్లు.

2024 జూలై 31నాటి ఆయా ఆస్తుల ధరల ఆధారంగా హురున్ ఈ జాబితా రూపొందించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివనాడార్, ఆయన కుటుంబం రూ.3.14 లక్షల కోట్ల సంపదతో తృతీయస్థానంలో, వ్యాక్సిన్ల తయారీ సంస్థ సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా నాల్గవ స్థానంలో, సన్‌ఫార్మా చైర్మన్ దిలీప్ సింఘ్వి ఐదో స్థానంలో నిలిచారు. 

ప్రతీ 5 రోజులకూ ఒక కొత్త బిలియనీర్

భారత్‌లో ప్రతీ ఐదు రోజులకూ ఒక కొత్త బిలియనీర్ అవతరిస్తున్నారని హురున్ నివేదిక తెలిపింది. ఆసియాలో సంపద సృష్టికి భారత్ ఒక ఇంజిన్‌గా ఆవిర్భవించిందని, చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం తగ్గగా, భారత్‌లో ఈ సంఖ్య 29 శాతం పెరిగిందని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునాయిద్ తెలిపారు. ఇండియాలో రికార్డుస్థాయి లో 334 బిలియనీర్లు ఉన్నారని వెల్లడించారు. దేశీయ శ్రీమంతుల్లో ఆరుగురు గత ఐదేండ్లుగా టాప్ టెన్‌లో కొనసాగుతున్నారు. వారు..గౌతమ్  అదానీ, ముకేశ్ అంబానీ, శివనాడార్, సైరస్ పూనావాలా, గోపీచంద్ హిందూజా, రాధాకిషన్ దమానిలు.  

లిస్ట్‌లోకి షారుఖ్ ఖాన్ 

హురున్ ఇండియా ధనికుల జాబితాలోకి తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రవేశించారు. ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఉన్న వాటాల విలువ, సినిమా నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ విలువ గణనీయంగా పెరగడంతో షారూఖ్ సంపద రూ.7,300 కోట్లకు పెరిగింది. గత ఏడాదికాలంలోనే ఈ విలువ రూ.40,000 కోట్ల మేర పెరిగిందని హురున్ తెలిపింది. సినీ రంగానికి చెందినవారిలో జుహి చావ్లా, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్‌లు టాప్‌| ఉన్నారు. 

పిన్న వయసులో బిలియనీర్

క్విక్‌కామర్స్ స్టార్టప్ జెప్టో వ్యవస్థాపకుల్లో ఒకరైన 21 ఏండ్ల కైవల్య వోహ్రా భారత్ బిలియనీర్లలో పిన్న వయస్కుడు. జెప్టో సహ వ్యవస్థాపకుడు 22 ఏండ్ల అదిత్ పలీచా జాబితాలో రెండో పిన్న వయస్కుడు. ఈ స్టార్టప్ విలువను  5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.42,200 కోట్లు)గా గణించారు.