calender_icon.png 9 November, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి అసలు సర్వే

09-11-2024 12:20:46 AM

  1. ముగిసిన ఇళ్లకు స్టిక్కరింగ్
  2. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.17 కోట్లు
  3. కులగణనకు 94,750 ఎన్యుమరేటర్ల సన్నద్ధం

హైదరాబాద్, నవంబర్ 8(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణనలో భాగంగా అసలైన సర్వే శనివారం నుంచి ప్రారంభం కానుంది. సర్వేలోని మొదటి అంకానికి శుక్రవారంతో తెరపడింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఇళ్లకు స్టిక్కిరింగ్ ప్రక్రియ నేటితో ముగిసింది.

రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారు.. ఉన్న చోటనే సర్వేలో పాల్గొనొచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన చాలా మంది.. అద్దె ఇళ్లలోనే సర్వే చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కొద్ది శాతం మంది మాత్రం సొంతూళ్లలో సర్వేలో పాల్గొనేలా వాళ్ల ఇళ్లకు స్టిక్కర్లను అంటించేలా చూసుకున్నారు.

ఇదిలా ఉండగా.. సమగ్ర సర్వే కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సిబ్బందికి ఇప్పటికే 75 ప్రశ్నలతో కూడిన షీట్లను అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 1.17 కోట్ల కుటుంబాలు ఉండగా.. 94,750 మంది ఎన్యుమరేటర్లతో ప్రభుత్వం సర్వే చేయించనుంది. కులగణనలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 175 ఇళ్లు మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఒకవేళ ఎక్కువ ఇళ్లు వచ్చినచోట అదనపు ఎన్యుమరేటర్‌ను నియమిస్తున్నారు. ప్రతి ఈబీకి ఒక ఎన్యుమరేటర్ ఉంటారు. అలాగే 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. సర్వేను పర్యవేక్షించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 9,478 మంది సూపర్‌వైజర్లను నియమించింది.

జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్ సర్వేను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్డు ద్వారా కులగణన తీరును పరిశీలించనున్నారు.

ప్రత్యేక పర్యవేక్షణ

కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రక్రి యను పర్యవేక్షణ అధికారులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌తో పాటు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. గత వారం రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే సర్వేపై ఎన్యుమరేటర్లు ఒక అవగాహనకు వచ్చారు. ఫీల్డ్‌లోకి వెళ్లిన తర్వాత ఏమైనా సమస్యలుంటే వాటిన పరిష్కరించడానికి మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికా రులను నియమించారు. వారు సర్వే జరిగే అన్ని రోజులు క్షేతస్థాయిలో పర్యటించి.. కులగణన తీరును పర్యవేక్షిస్తారు.