18-04-2025 12:00:00 AM
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావటంతో నార్కోటిక్ పోలీసు బృందం అక్కడ దాడులు జరిపింది. నార్కోటిక్స్ బృందం హోటల్‌కు వచ్చేముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం మూడో అంతస్తు లో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గంలో స్విమ్మింగ్‌పూల్ మీదుగా పలాయనం చిత్తగించాడు.
డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణపై షైన్ ఇంతకు ముందు 2015లో అరెస్ట్ అయ్యాడు. సదరు కేసులో షైన్‌ను ఇటీవలే కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతడు ఇప్పుడు మళ్లీ హోటల్ నుంచి పారిపోతున్న వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. మరోవైపు సినిమా సెట్‌లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తాజా గా విన్సీ సోనీ అలోషియస్, షైన్ టామ్ చాకోపై ఫిర్యాదు చేశారు.
కేరళ ఫిల్మ్ చాంబర్‌తోపాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘సూత్ర వాక్యం’ అనే సినిమాలో నటించారు. తాజాగా నటి ఆరోపణలు మల యాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
షైన్.. తెలుగులో నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ చిత్రంలో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిరుడు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘దేవర’లోనూ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల అజిత్‌కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలోనూ నటించాడు.