19-03-2025 12:49:05 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మార్చి 18 ( విజయక్రాంతి) : వచ్చె విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు అందించే విధంగా ఇప్పటి నుంచే కార్యా చరణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ తన ఛాంబర్ లో విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనటికి కనీసం ఒక జత దుస్తులు ఇవ్వాలని మిగిలిన మరో జత పాఠశాలలు ప్రారంభం అయ్యాక ఇవ్వాలని సూచించారు.
సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర: సమాజంలోని సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని, అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయు) ఆధ్వర్యంలో చిట్యాల గ్రామ శివారులోని దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్లో మెడికోవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం దిశగా చొరవ చూపుతారని చెప్పారు. మన దేశంలో ఎంతోమంది గొప్ప జర్నలిస్టులు ఉన్నారని, పెద్ద పెద్ద కుంభకోణాలను బయట పెట్టడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
జర్నలిస్టులు సమయాభావం లేకుండా పని చేస్తుంటారు కాబట్టి, వారి సొంత ఆరోగ్యం పైన సైతం శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు, జర్నలిస్టులు, వైద్యశాఖ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.