calender_icon.png 29 April, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

29-04-2025 12:12:25 AM

  1. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

పలు సమీక్షలు, కార్యక్రమాలకు హాజరైన మంత్రి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రజలకు ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పొలం బాటలు, పంటకాలువల వంటి పనులకు ప్రాధాన్యనివ్వా లని, పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. సోమవారం వివిధ కార్యక్రమాల్లో, సమీక్షల్లో ఆమె పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జడ్పీసీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు, డీపీఆర్‌ఈలకు రాష్ర్టస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు.

సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, పీఆర్ ఆర్‌డీ డైరెక్టర్ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో ఈ సంవత్సరంలో చేయాల్సిన పనుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, మే చివరిలోపు పనులను గుర్తించాలన్నారు. రంగా రెడ్డి జిల్లా మాల్ గ్రామపంచాయతీకి ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి అవార్డు రావడం గర్వకారణమన్నారు.

ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో ఎప్పటికప్పుడు బడ్జెట్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 3 అంగన్వాడీ భవనాలను నిర్మించే పనులను ప్రారంభించాలని సూచించారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో ఐఐఎం కోల్‌కతా ప్రొఫెసర్‌లతో సెర్ప్ సిబ్బందికి నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న వ్యాపారాలను గుర్తించి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని సూచించారు. మాదాపూర్‌లోని నోవాటెల్‌లో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిర మహిళా శక్తి పాలసీ ద్వారా 15 నెలల్లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో రెండు లక్షలకు పైగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు.