ట్రైబల్ కో-ఆపరేటివ్ సోసైటీ చైర్మన్ తిరుపతి
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): సరుకులను ఎవరైనా పక్కదోవ పట్టిస్తే చర్యలు తప్పవని ట్రైబల్ కో ఆపరేటివ్ సోసైటీ చైర్మన్ కొట్నాక తిరుపతి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని జీసీసీ గోదాములను తనిఖీ చేశారు.
కాగజ్‌నగర్‌లోని డాడానగర్‌లోని ఓ ఇంటిలో గిరిజన శాఖకు సంబంధించిన సరుకులు దింపుతుండగా కొందరు యువకులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తిరుపతి విచారణ చేపట్టారు.
గోదాముల్లో సరుకులతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆసిఫాబాద్‌లోని జీసీసీ గోదామును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తుందని, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదన్నారు.
సరుకులు పట్టుబడడంతో మేనేజర్ బోజ్జునాయక్‌నూ విచారించారు. మేనేజర్‌పై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కమిషనర్‌కు నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.