26-04-2025 12:23:18 AM
- వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ కేవీఎన్ రెడ్డి
- నష్టపోయిన రైతుల పంట పొలాల పరిశీలన
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 25 (విజయక్రాంతి) రైతులకు నకిలీ క్రిమిసంహారక మందులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ కేవీఎన్ రెడ్డి హెచ్చరించారు. వరి పంటకు క్రిమి సంహారక మందు వినియోగించి నష్టపోయిన నాగర్ కర్నూల్ మండలం చందుబట్ల, నర్సాయిపల్లి గ్రామాలలో శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి అనే రైతుల వరి పంటలను కెవిన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను మోసం చేసి నష్టం చేకూర్చే ఏజెన్సీల చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. సీడ్స్ అండ్ ఫిలైజర్స్ దుకాణదారులు ఎంతటి వారైనా వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతులకు నకిలీ విత్తనాలు క్రిమిసంహారక మందులు విక్రయించే ఏజెన్సీలపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చందుపట్ల నర్సాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో కేవీయన్ రెడ్డి రైతుల పొలాలను పరిశీలించారు.వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఏడి పూర్ణ చందర్ లతో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో భూత్పూర్ ములుగు లాటి ప్రాంతాలలో నకిలీ మందులు విత్తనాలపై సీరియస్ గా ఉన్నామని రైతులకు నష్టం చేసే ఏ చర్యలకు కూడా ఉపేక్షించేది లేదన్నారు.