calender_icon.png 18 October, 2024 | 2:13 PM

మూసీలో మురుగు కలవకుండా చర్యలు

18-10-2024 12:23:40 AM

  1. నిలిచిపోయిన టన్నెలింగ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు జలమండలి సిద్ధం
  2. దీర్ఘకాలిక నిరీక్షణకు 90 రోజుల కార్యక్రమంతో తెర

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మూసీ నదిలో మురుగు కలవకుండా జలమండలి చర్యలు చేపట్టింది. కొన్నేళ్ల క్రితమే రూపొందించిన సీవరేజీ టన్నెలింగ్ ప్రాజెక్టును ఇటీవల చేపట్టిన 90 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

అనివార్య కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసింది. త్వరలో ప్రాజెక్టును పూర్తి చేయాలని జలమండలి యోచిస్తోంది. దీంతో దీర్ఘకాలిక నిరీక్షణకు తెర వేయబోతోంది. ఓ వైపు మూసీలో మురుగు కలవకుండా చర్య లు తీసుకుంటూ, మరోవైపు మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది.  

ఎంసీసీ ఫిర్యాదులు తగ్గే అవకాశం

పెండింగ్‌లో ఉన్న 0.6 కిలోమీటర్ల టన్నెలింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఓఅండ్‌ఎం 4, 5, 6 డివిజన్ల పరిధిలోని మురుగు మూసీ నాలాకు చేరకుండా నేరుగా అంబర్‌పేట ఎస్టీపీకి జలమండలి తరలించబోతోంది. తద్వారా మురుగును శుద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో తరచూ ఎంసీసీకి వచ్చే సీవరేజీ ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంది.

సీఎం ఆదేశాల మేరకు జల మండలి చేపట్టిన 90 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ఈ పనులను పూర్తి చేయాలని ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. కాగా నగరంలోని మురుగును శుద్ధి చేసేందుకు ఇప్పటికే దాదాపు 30 ఎస్టీపీలను నిర్మిస్తోంది. మరో 31 ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేసేలా ఆదేశాలు

కింగ్‌కోఠి, కాచిగూడలో జరుగుతున్న సీవరేజీ టన్నెలింగ్ పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి గురువారం పరిశీలించారు. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయాలని, అవసరమైతే రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టాలని సూచించారు. కింగ్‌కోఠిలో 200, కాచిగూడలో 200, బషీర్‌బాగ్‌లో 200 మీటర్ల చొప్పున టన్నెలింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

అనంతరం కాచిగూడ సత్యనగర్, బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో పర్యటించి ధ్వంసమైన మ్యాన్‌హోళ్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని సూచించారు. 20 రోజులకోసారి వస్తున్న సీవరేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

ఐదు కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ టన్నెల్

జలమండలి ఓఅండ్‌ఎం 4, 5, 6 డివిజన్ల పరిధిలోని రాజ్‌భవన్, సచివాలయం, అబిడ్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బర్కత్‌పురా, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లోని మురుగు నీటిని నాలాలో కలవకుండా నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రాని(ఎస్టీపీ)కి తరలించేందుకు 2007 లోనే ఈ పనులను చేపట్టింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర 1800 ఎంఎం డయా భారీ పైప్‌లైన్‌ను నిర్మించాలని ప్రణాళికలు రచించింది.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నింబోలీ అడ్డా వరకు ఈ పైప్‌లైన్ పనులను చేపట్టింది. ఈ ప్రాంతాల్లో రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ను నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు 4.4 కిలోమీటర్ల మేర ఈ పనులను పూర్తి చేసింది.

చాలా ప్రాం తాల్లో పరుపు బండ అడ్డు పడడంతో ఈ పనులను బ్రేక్ పడింది. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పనులు చేపట్టిన ఏజె న్సీ మధ్యలోనే వదిలేసింది. ఇటీవల మూసీ నదికి పునరుజ్జీవం పోస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ పనుల ను పూర్తి చేసేందుకు మోక్షం లభించింది.