- మూసీ పునరుజ్జీవనం కోసమే ఉస్మాన్‌సాగర్‌కు నీళ్లు
- కొండపోచమ్మసాగర్ అంచనాలే రూపొందించలేదు
- కేటీఆర్ ఆరోపణలపై జలమండలి వివరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6(విజయక్రాంతి) : సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విచారణ చేపట్టిందని హైదరాబాద్ జలమండలి పేర్కొంది. విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలో జలమండలి చేపట్టబోతున్న తాగునీటి ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై జలమండలి స్పందించింది. సుంకిశాల ఘటనపై సాంకేతిక నిపుణుల ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించామని పేర్కొంది. నిర్ధేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు స్పష్టం చేసింది.
పునరుజ్జీవనం కోసం 5టీఎంసీల నీరు
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పునరుజ్జీవనానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి గోదావరి ఫేజ్ రూపకల్పన చేసినట్టు జలమండలి పేర్కొంది. 15 టీఎంసీల నీటని తర లించేందుకు మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు 3600 ఎంఎం డయాపైప్‌లైన్ నిర్మించబోతున్నట్టు, ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు 2400 ఎంఎం డయా క్లియర్ వాటర్ పైప్‌లైన్ నిర్మాణం చేస్తున్నట్టు చెప్పింది.
3000 ఎంఎం డయారింగ్ మెయిన్‌కు అనుసంధానమై ఉంటుందని తెలిపింది. మూసీ పునరుజ్జీవనం కోసం ఘన్‌పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు 2200 ఎంఎం డయాపైపులైన్ నిర్మించడంతో 5 టీఎంసీల నీటిని తరలించవచ్చని పేర్కొంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, మూసీ పునరుజ్జీవనం, జంట జలాశయాలను నింపేందుకు 5 టీఎంసీలను తీసుకురా బోతున్నట్టు స్పష్టం చేసింది.
ఓఆర్‌ఆర్ పరిధిలోని 7 సరస్సులను నింపడంతోపాటు వాటి నీటి స్థాయిలను కాపాడడం కోసం టెండర్ జారీ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపింది. కొండపోచమ్మసాగర్ నుంచి నీటి తరలింపునకు జలమండలి అంచనాలను రూపొందించలేదని స్పష్టంచేసింది.