కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై31 (విజయక్రాంతి): డిగ్రీ కళాశాల విద్యార్థిని కుమ్రం లక్ష్మి మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు కోరారు. బుధవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లక్ష్మికి జ్వరం వస్తే కేవలం పారాసిట్మాల్ టాబ్లెట్స్ ఇచ్చి సరిపెట్టారని, జర్వం తీవ్రం అయిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లిన రోజే రాత్రి మృతి చెందిందన్నారు. డిగ్రీ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందిందని ఆరోపించారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీకనంద్, కార్తీక్, మాలశ్రీ, దుర్గం దినకర్, రాజేందర్, శ్రావణి తదితరులు ఉన్నారు.