calender_icon.png 24 October, 2024 | 10:04 AM

పాలమూరు నిర్వాసితుల ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు

02-09-2024 11:15:59 AM

గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పునరాభస కేంద్రం

 వట్టెం గుట్టను తొలచి ఏర్పాటు చేయడంతో ఇళ్లపైనే కూలి పడుతున్న వట్టెం గుట్ట

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం బిజినపల్లి మండలం వట్టెం గుట్టను అక్రమంగా తొలిచి అదే ప్రాంతంలో 400 మంది నిర్వాసిత రైతులకు పునరావాసం కల్పించి ఇళ్లను నిర్మించింది. కానీ ఆ ఇళ్లల్లోకి నేడు అర్ధరాత్రి వట్టెం గుట్ట కొండచరియలు విరిగిపడి మురుగు ఇళ్లల్లోకి వచ్చి చేరింది. దీంతో ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా నిర్వాసితులంతా కంగుతిన్నారు.

కాళ్లు బయట అడుగుపెట్టలేని పరిస్థితి పూర్తిగా కాలనీ అంతా భారీ ఎత్తున బండరాళ్లతోపాటు బురద మయంగా మారి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు, బట్టలు ఇతర వంట సామాగ్రి పూర్తిగా బురదలోనే కూరుకుపోయింది. అయినా అటువైపు ఎవరు ప్రస్తుత అధికారులు చేరుకోలేదని తమను ఆదుకోవడం లేదని నిర్వాసిత కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ ముసురు వర్షానికి అక్రమంగా తోల్చిన వట్టెం గుట్ట పూర్తిగా తడిసి ముద్దయి అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడి నిర్వాసిత కాలనీలోకి జారిపడింది. దీంతోపాటు చెరువులు కుంటలు నాలుగు పారుతుండడంతో ఆయా గ్రామాలకు పట్టణాల నుంచి రాకపోకలు తెగిపోయాయి. వట్టెం నిర్వాసితులను జిల్లా అధికారులు స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.