calender_icon.png 28 November, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన వ్యర్థాలు తొలగించకుంటే చర్యలు

27-10-2024 01:05:12 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో అక్రమంగా నిర్మించిన భవనాల ను హైడ్రా కూల్చివేసిన తర్వాత అట్టి నిర్మాణ వ్యర్థాలను సదరు యజమానులే తొలగించుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.

కూల్చివేతలలో ఇనుపచువ్వలు, ఇతర సామగ్రితో పాటు వ్యర్థాలను కూడా తొలగిం చాల్సిన బాధ్యత సదరు బిల్డర్లు, యజమానులదే అన్నారు. నగరంలో చెరువులు, కాలువలు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాలను కాపాడుకొని ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు హైడ్రా ఏర్పాటైనట్లు తెలిపారు.

హైడ్రా ఆవిర్భవించి 100 రోజులు పూర్తికావడంపై కమిషనర్ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెరువుల పునరుజ్జీవనానికి హైడ్రా చేస్తున్న కృషికి మీడియా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా పనికట్టుకుని హైడ్రాపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశాయన్నారు.

ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేయదని స్పష్టం చేశారు. సర్వే నంబర్లు మార్చేసి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొందిన భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. వీటితో పాటు నగరంలో ట్రాఫిక్, వరద నీటి సమస్య పరిష్కారానికి హైడ్రా కృషి చేస్తుందన్నారు.