calender_icon.png 25 November, 2024 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల పునరుద్ధరణకు చర్యలు

31-10-2024 02:03:29 AM

  1. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  2. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి తౌటోనికుంట పరిశీలన 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): నగరంలో నివాసాల మధ్య ఉన్న చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ముందుగా చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. 

ఈ మేరకు బుధవారం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఖాజాగూడ తౌటోనికుంటను జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తౌటోనికుంట పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

కుంటకు సమీపంలోనే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలవడంతో దగ్గరలోని అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలోని నీరు వచ్చి చేరుతోందని ఈ సందర్భంగా స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఖాళీ స్థలం నుంచి వరద నీరు నేరుగా తౌటోనికుంటకు చేరితే ఇబ్బందులు తొలగిపోతాయని హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కమిషనర్ రంగనాథ్.. తౌటోనికుంట నిండితే ఆ నీరు నేరుగా భగీరదమ్మ చెరువుకు చేరేలా కాల్వ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ట్రాఫిక్ సహాయకులుగా హైడ్రా వలంటీర్లు 

నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా ట్రాఫిక్ వలంటీర్లు బుధవారం రంగంలోకి దిగారు. ఇప్పటికే మొదటి విడత ట్రాఫిక్ నియంత్రణపై హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది 50 మంది శిక్షణ పొందారు.  ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా ఈ సేవలు అందించనున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రేడియం జాకెట్ వేసుకొని హైడ్రా సిబ్బంది పలు ప్రాంతాలలో ట్రాఫిక్ విధుల్లో ఉన్నట్టు తెలిపారు.