calender_icon.png 25 December, 2024 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు

19-10-2024 02:52:50 AM

  1. 34 వేల 92 ఎకరాలకు జియో ట్యాగింగ్ 
  2. ఒకే గొడుగు కిందకు 24 రకాల ఆన్‌లైన్ సేవలు
  3. భద్రాచలం అభివృద్ధికి రూ.60 కోట్లు
  4. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, అక్టోబర్ 18( విజయక్రాంతి): దేవాదాయ భూములను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల భూములను సర్వే చేసి సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా 34 వేల 92 ఎకరాల దేవాదాయ భూములను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసినట్లు వివరించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే 57 శాతం భూములను ధరణిలో నిక్షిప్తం చేశామని చెప్పారు.

వివాదంలో ఉన్న దేవాదాయ శాఖ భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే హోటల్, ఫుడ్, టికెట్స్‌తో పాటు ఇతరత్రా 24 రకాల ఆన్‌లైన్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం దేవాదాయ శాఖ సమగ్ర వెబ్‌సైట్‌ను తయారు చేయబోతుందన్నారు.

వచ్చే  బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరిగుట్ట ఆలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం చేస్తున్నట్లు వివరించారు. విరాళాల ద్వారా రూ.15 కోట్లు సేకరించినట్లు, ఆ నిధులతో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో యాదాద్రి లడ్డూ నాణ్యతపై మంత్రి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల లడ్డూలు టెస్టింగ్‌కు పంపితే.. యాదాద్రి లడ్డూ భేష్ అని రిపోర్టులో తెలిందని మంత్రి వివరించారు. 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాం

వేములవాడ ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి సురేఖ చెప్పారు. ఇప్పటికే రూ.70 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆలయానికి చెందిన 850 కోడెలను స్థానిక రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. భద్రాచలం దేవస్థాన అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భూమిని సేకరించేందుకు రూ.60 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

దేవాదాయ శాఖలో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలను చాలా వరకు పరిష్కరించామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా బదిలీలు లేకుండా ఒకే చోట పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం కల్పిస్తూ.. భారీగా బదిలీలు చేపట్టమని వివరించారు.