calender_icon.png 20 October, 2024 | 5:31 AM

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

20-10-2024 02:57:13 AM

  1. గ్రూప్-1 పరీక్షకు పటిష్ఠ బందోబస్తు
  2. ముత్యాలమ్మ ఆలయ ఘటనపై విచారణ 
  3. పౌరులు సంయమనం పాటించాలి
  4. ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు
  5. మీడియా సమావేశంలో డీజీపీ జితేందర్

హైదరాబాద్, అక్టోబర్ 19(విజయక్రాంతి): ఆందోళనల పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఎవరైనా పరీక్షలకు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. కోర్టుల ఆదేశాల ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసారు. హైకోర్టు ఆదేశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.

కానీ రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే.. చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, సికింద్రాబాద్‌లో జరిగిన ముత్యాలమ్మ ఆలయ ఘటనపై కూడా డీజీపీ స్పందించారు. ఆ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. పౌరులు సంయమనం పాటించాలని, ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు..

ఈ నెల 21 నుంచి 31వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. 1959లో కరమ్ సింగ్ నేతృత్వంలోని సీఆర్‌పీఎఫ్ పెట్రోలింగ్ జవాన్ల బృందం లద్ధాఖ్‌లో చైనాతో విరోచితంగా పోరాడిన సందర్భానికి గుర్తుగా ఏటా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు సంస్మరణ దినోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.

31వ తేదీన వల్లాభాయ్ పటేల్ జయంతితో దినోత్సవాలు ముగుస్తాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో సంస్మరణ దినోత్సవాలకు సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్‌ను డీజీపీ విడుదల చేశారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు 214 మంది పోలీసులు దేశవ్యాప్తంగా చనిపోయినట్లు, అం దులో ఒకరు తెలంగాణ నుంచి ఉన్నట్లు డీజీపీ తెలిపారు. గతేడాది విధుల్లో ప్రా ణాలు అర్పించిన పోలీసుల ధైర్య సహసాలను వివరిస్తూ బుక్‌లెట్‌ను ప్రచురించ నున్నట్లు వెల్లడించారు. అలాగే, హోర్డింగ్‌లు, బ్యానర్‌లు, పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. 

* 21వ తేదీన పోలీస్ పరేడ్.

* 22 నుంచి 24 వరకు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు సన్మానం

* డీజీపీ ఆఫీస్, పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కార్యాలయాల్లో రక్తదాన శిబిరాల నిర్వహణ

* 25వ తేదీ నుంచి 27 వరకు యువత, విద్యార్థులతో సైకిల్ ర్యాలీల నిర్వహణ

* 27, 28 తేదీల్లో పోలీసు అధికారులు వారి పరిధిలోని గ్రామాల్లో సందర్శన

* 21-31వ తేదీ వరకు ప్రతి వారాంతంలో ట్యాంక్ బండ్‌తో పాటు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో పోలీస్ బ్యాండ్ ప్రదర్శన