26-02-2025 05:53:51 PM
డి.ఎస్.పి రామానుజం..
రూ.21.50 లక్షల మద్యం పట్టివేత...
చింతల మానేపల్లి (విజయక్రాంతి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ రామానుజం తెలిపారు. చింతలమానపల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.21.50 లక్షల మద్యన్ని పోలీసులు దాడులు చేసి స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ... 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులను ప్రభుత్వం ఆదేశాల మేరకు మూసి వేయడంతో ముందస్తుగానే శ్రీనిధి వైన్ షాప్ యజమాని కొడిపాక సత్యనారాయణ భారీ ఎత్తున మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి తన షాపులో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతుండగా పక్క సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
అక్రమంగా మద్యం అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన సరికాదన్నారు. వైన్ షాప్ యజమాని సత్యనారాయణతో పాటు అంజన్న శంకర్ సంతోష్ జైస్వాల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మద్యం పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రమేష్, ఎస్సైలు నరేష్, ప్రవీణ్, మధుకర్, ఏఎస్ఐ మను సిబ్బంది విజయ్, తిరుపతి, దినకర్, మహేష్, ఆనంద్ లను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.