- నిషేధిత మత్తు పదార్థాలతో తయారీ
- ప్రజల ప్రాణాలకు ముప్పు
- తయారీదారులపై చర్యలు తీసుకోని అధికారులు
- మూమూళ్లు తీసుకుని వదిలేస్తున్న వైనం
నారాయణపేట, జూలై 7 (విజయక్రాంతి): నారాయణపేట జిల్ల్లాలో కల్తీకల్లు దందా యథేచ్ఛగా సాగుతున్నది. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను నీటిలో కలిపి కల్లును తయారు చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కల్తీ కల్లు దందా నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు అధికారులు దాడులు నిర్వహించకుండా వదిలేస్తు న్నారని ఆరోపణలొస్తున్నాయి. జిల్లాలోని మక్తల్, క్రిష్ణ, హిందుపూర్, గుడెబల్లుర్, టైరొడ్డు, మరికల్, ధన్వాడ, నారాయణపేట మండలాల్లో కల్తీకల్లు విక్రయాలు జోరుగా కొన సాగుతున్నాయి.
సాధారణంగా ఈతచెట్ల ద్వారా గీత కార్మికులు గీచిన కల్లు తక్కువే అయినా.. ఆల్ఫా జోం, డైజోఫామ్‌తో కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. కల్లుప్రియులు మత్తులో జోగడానికి కొన్ని సార్లు ప్రభుత్వం నిషేధం విధించిన సీహెచ్ మత్తు పదార్థంతో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ నిషేధిత పదార్థాలు కలిపిన కల్లు తాగడంతో కల్లు ప్రియులకు మతిమరుపు వస్తుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాకుండా ఒకటి రెండు రోజులు కల్లు తాగ కుండా ఉంటే వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ప్రభుత్వం నిషేధించిన సీహెచ్ మత్తు పదార్థ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కర్ణాటక గ్రామాలకు సరఫరా
కాన్కూర్తీ, జిలాల్పూర్, టైరోడ్, హిందుపూర్ కేంద్రంగా తెలంగాణ సరిహద్దులు దాటి కర్ణాటక రాష్ట్ర గ్రామాలకు ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో కల్తీకల్లును ఆటోల్లో సరిహద్దులు దాటించి విక్రయాలు కొనసాగి స్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కల్లుపై నిషే ధం ఉండటంతో ఇదే అదునుగా భావించిన ఇక్కడి వ్యాపారులు కల్తీ కల్లును కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలకు తరలించి అమ్ముతున్నారు.
‘మామూళ్ల’ మత్తులో అధికారులు
కల్తీకల్లు దందా జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వ్యాపారులు నెలనెలా ఇచ్చే మామూల్ల మత్తులో జోగుతూ అటు వైపు కన్నెత్తి చూస్తలేరని ఆరోపణలు వస్తున్నాయి. అడపాదడపా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి వదిలేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం పై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.