15-03-2025 08:51:19 PM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు..
విజయక్రాంతి వరుస కథనాలకు స్పందన..
ఆర్ఎంపీ, పిఎంపీల క్లినిక్ ల తనిఖీలు...
పెబ్బేరు: పెబ్బేరు మున్సిపాలిటీలోని ఆర్ఎంపీ, పిఎంపీల క్లినిక్ లను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో విజయక్రాంతి దినపత్రికలో "కళ్ళు మూసుకున్నాం.. కానిచ్చేయండి", "అర్హత లేకుండానే అన్ని రకాల వైద్యం" కథనాలకు జిల్లా ఉన్నత అధికారులు స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు తన యంత్రంగంతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పెబ్బేరు మున్సిపాలిటీలో 2 నర్సింగ్ హోమ్, 4 ప్రయివేట్ ఆసుపత్రులు, 8ఆర్ఎంపీ, పిఎంపీల క్లినిక్లు, ఒక మొలల ఆసుపత్రులను తనిఖీ చేశామన్నారు.
స్కానింగ్ సెంటర్లలో సంబంధిత వైద్యులు తప్పనిసరిగా ఉండాలన్నారు. చాలామంది ఆర్ఎంపీలు, పిఎంపీలు కమిషన్ల కోసం రోగులను కర్నూల్ ఆసుపత్రులకు తీసుకువెళ్లుతున్నారని మాకు సమాచారం ఉందన్నారు. పెబ్బేరు మండల పరిసరాల నుంచి రోగులను కర్నూల్ ఆసుపత్రులకు తీసుకువెళ్లి సర్జరీలు, వైద్యం, అబార్షన్లు చేయిస్తున్నారని మా దృష్టిలో ఉందన్నారు. మొదటిసారీ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంగిస్తే అవగాహన కల్పించి హెచ్చరించడం జరుగుతుందన్నారు.
రెండవసారీ తనిఖీల్లో పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలు, బాలింతలు, ఇరువర్గాల మధ్య గొడవలో గాయపడిన వారికి అర్హతకు మించి వైద్యం చేయడం చట్ట విరుద్ధం, మెడికో లీగల్ కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిబంధనలకు లోబడి వైద్యం చేయాలని ఆదేశించారు.