ఎరువులు విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నిర్మల్ జూన్ 9 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం సాయంత్రం సోన్ మండల కేంద్రంలోని బాలకిషన్ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువులు విత్తనాల స్టాక్, క్రయ విక్రయాల రిజిస్టర్లను తనిఖీ చేశారు.
రిజిస్టర్ లలోని వివరాలను ఆన్లైన్ వివరాలతో సరిపోల్చారు. క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులన్నీ పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రికార్డుల్లో తేడాలు ఉండరాదన్నారు. పలు కంపెనీల విత్తనాల లేబుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలను అమ్మరాదని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని అన్నారు.
రైతుల నుంచి విత్తనాలు, ఎరువులకు నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేయరాదని చెప్పారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలన్నారు. ఎరువులు విత్తనాల కృత్రిమ కొరత సృష్టించినా, నకిలీవి అమ్మినా, అధిక ధరకు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు డిసిఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందివ్వాలని అన్నారు. ఈ తనిఖీలలో జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, తహసిల్దార్ సంతోష్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






