ఇన్చార్జి డిఈఓకు వినతి చేసిన ఐక్య విద్యార్ధి సంఘాలు..
మంచిర్యాల (విజయక్రాంతి): అనుమతి లేకుండా పాఠశాలల పేరిట అడ్మిషన్లు తీసుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి లలితకి ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే కిడ్జి ఎలిమెంటరీ స్కూల్ పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్నారని, ఈ స్కూల్ కు ఎలాంటి అనుమతులు లేవని, బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా పూర్తి కాలేదని, కానీ అందులోనే సోమవారం పాఠశాలను ఓపెన్ చేయడం, రంగురంగుల హంగు హార్భాటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి వసంత పంచమి రోజున అడ్మిషన్లు పొందిన వారికి ప్రత్యేక రాయితీ ఉంటుందని చెప్పి తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్లు పొందుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్న స్కూల్ పై విచారణ జరిపించి, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బచ్చలి ప్రవీణ్ కుమార్, షేక్ సల్మాన్ పాషా, జుమ్మడి గోపాల్, జాగిరి రాజేష్, పూరెల్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.