పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ప్రభంజనం.
లక్షెట్టిపేట, విజయక్రాంతి: మండలంలోని చెరువులను, కుంటలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు ప్రభంజనం అన్నారు. శనివారం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ప్రభంజనం మాట్లాడుతూ లక్షెట్టిపేట మండలంలో చెరువులు, కుంటలు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయని, వెంటనే చెరువులను కుంటలను కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూమి గల చెరువులకు, కుంటలకు, మత్తడిలకు ఎఫ్.టి.ఎల్ లెవెల్, బఫర్ జోన్లకు సరిహద్దులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రభుత్వ భూములకు రక్షణగా హద్దులను ఏర్పాటు చేస్తూ ఫెన్సింగ్ నిర్మాణమును ప్రభుత్వపరంగా నిర్మించాలన్నారు. చెరువులను పూర్తిస్థాయిలో గుర్తించి చెరువుల చుట్టూ ప్రహరీలుగా నాపరాయి బండలతో గోడలు, కట్టలను ఉపాధి హామీ పనిలో భాగంగా పటిష్టంగా నిర్మాణములు చేయాలని, నది, వాగులలోని రాళ్లను బంజేరు భూమిలోని బండలను సేకరించి అన్ని గ్రామాలలోని చెరువులకు ప్రహరీ లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆకాష్ మండల్, బి.అరుణ్, ఏ. రవీందర్, యోగేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.