హుజూర్ నగర్ : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగగిరి రోడ్డులో పెట్రోల్ బంకు దాటిన తర్వాత మట్టపల్లి రోడ్డు బైపాస్ వైపుకు గల శ్రీ వెంకటేశ్వర దేవాలయం వైపు ఉన్న దాదాపు కిలోమీటర్ దూరం గల బైపాస్ రోడ్డును నాణ్యత లేకుండా నిర్మించిన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు సోమగాని నరేందర్ గౌడ్ మరియు ప్రజా కళాకారుడు బాదే నరసయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు రోడ్డును పరిశీలించి మాట్లాడుతూ.. రోడ్డు వేసి కనీసం రెండు నెలలు గడవక ముందే రోడ్డుకిరువైపులా కృంగిపోవడం జరిగిందనీ, రోడ్డు మధ్యలో అక్కడక్కడ గుంతలు పడ్డాయనీ, నెల క్రితం కురిసిన భారీ వర్షానికి, వరదకి మట్టపల్లి రోడ్డు బైపాస్ లో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద రోడ్డు కొట్టుకుపోయిందనీ, ఇటీవల వడ్ల బస్తాల లోడుతో వస్తున్న ట్రాక్టర్లో గల వడ్ల బస్తాలు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల క్రింద పడ్డాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు నిర్మిస్తున్న డివైడర్ ను కూడా నాసిరకంగా నిర్మిస్తున్నారనీ, కాంక్రీట్ మిక్స్ ను తగిన పాలల్లో తయారు చేయట్లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అయూబ్ మరియు స్థానిక వ్యక్తి తదితరులు పాల్గొన్నారు.