కలెక్టర్ కు వికలాంగుడు, ఎస్.జి.టి టీచర్ బూర శ్రీనివాస్ విజ్ఞప్తి.
ముషీరాబాద్ (విజయక్రాంతి): తనకు పదోన్నతి దక్కనీయకుండా సస్పెండ్ చేసేందుకు కుట్రపన్నుతున్న అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని ఓ వికలాంగ ఉపాధ్యాయుడు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసీఫ్ నగర్ మండలంలోని సిసి నగర్ లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ బూర శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈనెల 23వ తేదీ గురువారం నాడు తాను పాఠశాలకు వెళ్ళి సమీపంలో ఉన్న ఆసీఫ్ నగర్-1 మండల కార్యాలయంలోకి వేతనం బిల్లు కోసం వెళ్ళడం జరిగిందన్నారు. కాగా ఇంతలోనే ఆ కార్యాలయంలోని మండల విద్యాశాఖాదికారి ఎండి.ముస్తాఫా స్కూల్లోకి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో తాను పాఠశాలకు హాజరుకాలేదని రిమార్క్ వేయడం జరిగిందన్నారు. ఆయన తనపైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ పదోన్నతి రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తక్షణమే ఆయనపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మయ్య గౌడ్ పాల్గొన్నారు.