ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఉన్నతాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం శాసనమండలిలో మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలులో లోపం ఉందని, ఐఏఎస్ నియామాకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారి ప్రకటించడం సరికాదన్నారు. దివ్యాంగులు ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో రాణిస్తున్నప్పటికీ వారి ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బానుప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని, వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి విస్తృతంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని మందులు, వైద్య పరికరాలు తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.