25-03-2025 05:19:39 PM
తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలంలోని సెయింట్ థెరిస్సా ఇంగ్లీష్ మీడియం పాఠశాలపై విద్యాశాఖ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం మండల విద్యాధికారి సూర మల్లేశంకు తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ ఫీజు కట్టలేదని కారణంతో విద్యార్థులను ఎండలో బయట నిలబెడుతూ పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అనైతిక చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బందుల గురిచేస్తున్న సెయింట్ థెరిస్సా పాఠశాలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఈ పాఠశాలకు హాస్టల్ అనుమతి లేకపోగా విద్యార్థులు చాలామంది హాస్టల్లో ఉంటున్నారని, వారి బాగోగులు సరైన చూసుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోనే పుస్తకాలు, నోట్ బుక్కులు, పెన్నులు, స్కూల్ డ్రెస్సులు, చాక్లెట్లు విక్రయిస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పాఠశాలలో తరగతికి నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో ఎగ్జామ్ ఫీజు ఆక్టివిటీస్ ఫీజు అని అదనంగా వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ అన్నారు.