28-04-2025 08:32:04 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): రైతులను నిలువు దోపిడీ చేస్తున్న సీడ్ కంపెనీ(Seed Companies) యజమాన్యాలపై వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు ముచ్చ సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సోమవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఇవ్వకుండా రైతులను దోపిడీ చేస్తున్న సీడ్ కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వడ్లకు 2320 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతోపాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుండగా, ఇందుకు విరుద్ధంగా సీడ్ కంపెనీలు కేవలం 2750 రూపాయలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
సీడ్ వరి పండించిన రైతులకు అదనంగా బెరుకులు ఏరడంతో పాటు 12 శాతం మ్యాచర్ రావడానికి మిగతా వడ్ల కంటే రెండు రోజులు ఎక్కువ ఎండబోయాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకు అదనపు భారం పడుతున్నప్పటికీ సీడ్ కంపెనీ యజమానులు ఒక్కో క్వింటాపై 100 రూపాయలు తక్కువ చేసి ఇస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ కంపెనీలకు చెందిన వడ్లు కాకుండా మిగతా వడ్లు 17% తేమ ఉన్న మద్దతు ధర ఇస్తున్నప్పటికీ సీడ్ కంపెనీలు మాత్రం మద్దతు ధర ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సీడు వడ్లను పండించిన రైతులకు 3100 మద్దతు ధర కల్పించడంతో పాటు 20 రోజుల్లోనే ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రావుల భాస్కర్ రెడ్డి, గూడూరు మల్లారెడ్డి, పోరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.