calender_icon.png 8 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

06-01-2025 05:46:08 PM

రాజకీయ జోక్యంతో ఇష్టారాజ్యంగా మైనింగ్

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో అక్రమాలకు నిలయంగా మారిన తోగ్గుడెం క్వారీ నిర్వహణదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల అండదండలతో క్వారీ నిర్వహకుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిడి, క్వారీ నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల మత్తుకు అలవాటు పడిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిద్ర నటిస్తూ పరోక్షంగా సహకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అనుమతులు పొందిన ప్రదేశంలో కాకుండా ప్రభుత్వ భూముల్లో, అటవీ భూముల్లో మైనింగ్ చేస్తూ, అనుమతికి మించి లోడింగ్ చేస్తూ వాహనాలను తరలిస్తున్నా ప్రజల, పశువుల ప్రాణాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్వారీ నిర్వాహకులు జరిమానా చెల్లించకపోవడంతో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రెంచ్ కొట్టించారు. కానీ క్వారీ నిర్వహణ, మైనింగ్ పనులు ఏ మాత్రం ఆగకుండా వేరే మార్గం గుండా రాత్రిళ్ళు కంకర తరలింపును యదేచ్చగా నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి అక్రమ మైనింగ్, రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలే కనకరాజు, వినయ్, హరికృష్ణ, వంగా రవిశంకర్, తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.